ఆర్టీసీ కార్మికులు విధులలో చేరాలి: తెరాస ఎమ్మెల్యే

November 15, 2019


img

పరకాల ఎమ్మెల్యే చాలా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి నేతలు రెచ్చగొట్టడం వలననే 30 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను పక్కనబెట్టి ఆర్టీసీ కార్మికులు తక్షణం విధులలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విధులలో చేరితే సిఎం కేసీఆర్‌ వారికి న్యాయం చేస్తారు,” అని అన్నారు. 

కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీని మూసివేస్తానని సిఎం కేసీఆర్‌ గతంలోనే హెచ్చరించారు. కానీ ఆయన మాట కాదని మళ్ళీ సమ్మె చేసినందుకు వారి పట్ల కటినంగా వ్యవహరించారని అర్ధమవుతూనే ఉంది. పైగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ పెట్టడంతో మరింత బిగుసుకుపోయారు. అయితే హైకోర్టు ఒత్తిడి మేరకు వారితో అయిష్టంగానే చర్చలు జరిపించారు. ప్రభుత్వ వైఖరిని గ్రహించిన ఆర్టీసీ కార్మికులు ఆగ్రహావేశాలకు లోనై సమ్మెను కొనసాగించారు. అప్పుడే ప్రతిపక్షాలు రంగప్రవేశం చేశాయి తప్ప సమ్మెకు ముందు కాదు. 

ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఇటువంటి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి రాజకీయ ప్రయోజనం లేదా ప్రజాధారణ పొందాలని ఆశపడటం సహజం. పైగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్లలో న్యాయం కూడా ఉంది కనుకనే సమ్మెకు మద్దతు ఇచ్చాయి. 

ప్రభుత్వోద్యోగులు ఆర్టీసీ కార్మికులతో చేతులు కలిపే ప్రమాదం ఉందని పసిగట్టిన ప్రభుత్వం ముందే వారికి తాయిలాలు ప్రకటించి ఏవిధంగా వారిని ఆర్టీసీ కార్మికులకు దూరంగా ఉంచిందో, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారితో ప్రతిపక్షాలు చేతులు కలపకుండా నివారించి ఉండవచ్చు కానీ వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఇష్టపడకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. కనుక ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు అండగా నిలబడి సమ్మెను ఉదృతం చేసేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించిందని చెప్పవచ్చు. 

అయితే ‘సెల్ఫ్ డిస్మిస్’, ‘ఆర్టీసీ ప్రయివేటీకరణ’, ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగించడానికి ప్రభుత్వం దారులు వెతుకుతుండటం, సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వకపోవడం, ఆర్ధిక సమస్యలు, 42 రోజులుగా సమ్మె కొనసాగుతుండటం వంటి అనేక అవాంఛనీయ పరిణామాల కారణంగానే ఆర్టీసీ కార్మికులు గుండెపోటు, ఆత్మహత్యలతో చనిపోతున్నారనే సంగతి అందరికీ తెలుసు.

బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతమంది ఆర్టీసీ కార్మికులు వరుసగా చనిపోతున్నా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయలేకపోయారు. కనీసం సానుభూతి చూపే ధైర్యం చేయలేకపోయారు. పైగా ప్రతిపక్షాల కారణంగానే చనిపోతున్నారని ఎదురుదాడికి ప్రయత్నించడం బాధాకరం. 

సమ్మె మొదలైన కొత్తలో తెరాస ఎంపీ జీవన్ రెడ్డి ఒక్కరే ధైర్యంగా మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచారు. కానీ ఆయన చల్లబడిపోయారు. ఒకవేళ ఆరోజు ఆయన మధ్యవర్తిత్వం వహించి ఉండి ఉంటే సమ్మె ఇన్నిరోజులు కొనసాగేది కాదు. ఇంతమంది ఆర్టీసీ కార్మికులు చనిపోయి ఉండేవారు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ దురదృష్టం కొద్దీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా కటిన వైఖరి అవలంభిస్తుండటంతో ఆర్టీసీ కార్మికులు నిరాశనిస్పృహలతో వరుసగా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 

తోటి కార్మికుల పరిస్థితులు చూసి డీలాపడిపోయిన ఆర్టీసీ జేఏసీ నేతలే ఇప్పుడు ఒక మెట్టు దిగి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌ను పక్కన పెట్టినట్లు ప్రకటించారు. మిగిలిన సమస్యలపై చర్చలకు పిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధులలో చేరేందుకు సిద్దంగా ఉన్నామని చెపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కనుక వారిని, వారికి మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలను తప్పు పట్టడానికి లేదు.

ఒకవేళ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవ తీసుకొని సిఎం కేసీఆర్‌తో మాట్లాడి ఆర్టీసీ కార్మికులను మళ్ళీ బేషరతుగా విధులలో చేర్చుకొనేందుకు ఒప్పించగలిగితే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు చేసినవారవుతారు.

అయినా కన్న బిడ్డలవంటి ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఇంత కటినంగా వ్యవహరించడం అవసరమా? తెలంగాణ సాధన కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలు...పిల్లలూ ఆకలో రామచంద్రా... అని ఏడుస్తుంటే ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి గౌరవంగా ఉంటుందా? ఆలోచిస్తే బాగుంటుంది.


Related Post