బిజెపి కపట రాజకీయాలు మానుకోవాలి: తెరాస

November 15, 2019


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని అన్నారు.

దానిపై తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “హుజూర్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్ధి కంటే తక్కువ ఓట్లతో 4వ స్థానానికి పరిమితమైన బిజెపి ప్రగల్భాలు పలకడం మానుకోవడం లేదు. తెరాస ఎమ్మెల్యేలు టచ్చులో ఉన్నారంటూ కె.లక్ష్మణ్‌ మా పార్టీలో, ప్రజలలో గందరోగోళం సృష్టించాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెరాసలో ఏ ఒక్కరూ కూడా బిజెపిలో చేరేందుకు సిద్దంగా లేరు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి తెలుసుకొని తమతమ రాష్ట్రాలలో అమలుచేయడానికి కేంద్రమంతృలే మాతో టచ్చులో ఉన్నారు.

గోవా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో బిజెపి దొడ్డిదోవ గుండా అధికారం చేజిక్కించుకొంది. కానీ అటువంటి ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు సహించబోరని బిజెపి తెలుసుకొంటే మంచిది. తెలంగాణ ప్రజలు అభివృద్ధినే కోరుకొంటున్నారు కనుక అభివృద్ధి చేసి చూపిస్తున్న తెరాసవైపే ఉన్నారు. ఒకవేళ బిజెపి కూడా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవాలనుకొంటే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలి. విభజన హామీలన్నిటినీ అమలుచేయాలి. అంతే తప్ప తెరాసలో చిచ్చుపెట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలనుకొంటే కుదరదు,” అని అన్నారు. 

ఎన్నికలలో తెరాసను బిజెపి ఓడించడం కష్టమని ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, హుజూర్‌నగర్‌  ఎన్నికల ఫలితాలే నిరూపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 119 స్థానాలకు పోటీ చేయగా ఒకే ఒక స్థానాన్ని గెలుచుకోగలిగింది. హుజూర్‌నగర్‌లో కేవలం 1800 ఓట్లు మాత్రమే బిజెపికి పడ్డాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కనుక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనుకొంటే దొడ్డిదారిలోనే రాక తప్పదని అర్ధం అవుతోంది. ఈవిషయం బిజెపికి కూడా బాగా తెలుసు అందుకే ‘తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చి అడ్డుదారిలో అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం లేదని’ కె.లక్ష్మణ్‌ అన్నారు. అటువంటి ఆలోచన ఉంది కనుకనే ఆయన ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చు. కనుక ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో ఏదో ఓ రోజు బిజెపి అటువంటి ప్రయత్నం చేయకపోదు.

అయితే తెరాస ఏవిధంగా కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను పార్టీలోకి ఫిరాయింపజేసుకొని వాటిని రాజకీయంగా చావుదెబ్బ కొట్టి తాను బలపడిందో, బిజెపి కూడా అదేవిధంగానే బలపడాలనుకొంటే తెరాసకు ఆగ్రహం కలగుతోందిప్పుడు. తన దాకా వస్తే గానీ నొప్పి తెలియదంటే ఇదేనేమో?


Related Post