తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ అభ్యంతరాలు!

November 15, 2019


img

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది కనుక చిన్న చిన్న సమస్యలు కూడా అపరిష్కృతంగా నిలిచిపోయాయి. కానీ సిఎం కేసీఆర్‌తో మంచి సఖ్యత ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎం అయ్యాక ఇరు ప్రభుత్వాలు అనేక సమస్యలను చకచకా పరిష్కరించుకొన్నాయి. ఆ తరువాత కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం ప్రతిపాదనపై కూడా అధికారులు, ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ ఆ ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం ఎందుకో వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే అది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే కనుక ఇరు ప్రభుత్వాల మద్య ఎప్పటిలాగే సయోధ్య కొనసాగుతోంది. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌లో దాఖలు చేయడంతో మళ్ళీ రెండు రాష్ట్రాల మద్య జలవివాదాలు మొదలైనట్లే ఉన్నాయి. 

1. విభజన హామీలలో భాగంగా పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానిక్రింద ముంపుకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినందున, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోరాదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో కోరింది. 

2. కాళేశ్వరం ప్రాజెక్టు వలన దిగువన ఉన్న ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోతారని కనుక దానికి జాతీయహోదా ఇవ్వరాదని అఫిడవిట్‌లో కోరింది. 

3. తెలంగాణ ప్రభుత్వం రీ-డిజైనింగ్ పేరుతో చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలి. వాటి వలన దిగువన గల దవళేశ్వరం, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టులకు తగినంత నీరు లభించదు. కనుక నీటి లభ్యత, వినియోగంపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని అఫిడవిట్‌లో కోరింది. 

4. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణా, రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టులో 45 టీఎంసీల వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వ వాదన అసంబద్దంగా ఉంది కనుక దానిని తిరస్కరించాలి. 

ఈవిధంగా నీటి లభ్యత, పంపిణీ తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే జగన్‌ సిఎం అయిన తరువాత నీటి సమస్యలన్నిటినీ చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొంటున్నామని, జగన్ ప్రభుత్వంలో టిడిపికి అనుకూలంగా ఉన్న కొందరు అధికారులే ఇటువంటి సమస్యలను సృష్టిస్తున్నారని, వారిని తొలగించినట్లయితే సమస్యలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోగలమని తెరాసలో ఒక సీనియర్ నేత అన్నారు. 


Related Post