పిసిసి రేసులో నేను కూడా ఉన్నాను: జగ్గారెడ్డి

November 15, 2019


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తయి చాలారోజులైనప్పటికీ వరుసగా వచ్చిన ఎన్నికల కారణంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటి వరకు ఆయననే ఆ పదవిలో కొనసాగిస్తోంది. అయితే ఆ పదవిలో నుంచి తప్పుకోవాలనుకొంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్‌ అధిష్టానానికి చెప్పడంతో, ఆయన స్థానంలో కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. పిసిసి అధ్యక్ష పదవి రేసులో వి.హనుమంతరావు, షబ్బీర్ ఆలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఉన్నారు. 

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను కూడా ఈరేసులో ఉన్నానని ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా పిసిసి అధ్యక్ష పదవి తనకు ఇవ్వవలసిందిగా కోరుతూ కాంగ్రెస్‌ అధిష్టానానికి లేఖలు వ్రాశారు. త్వరలోనే డిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలిసి మాట్లాడుతానని, తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గొప్ప వ్యూహం ఉందని కూడా చెపుతున్నారు. 

కాంగ్రెస్‌ అధిష్టానం జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తుందో లేదో తెలియదు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నిజంగా ఆయన వద్ద అంతా గొప్ప వ్యూహం ఉన్నట్లయితే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దానిని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెవిలోనో లేదా సోనియా, రాహుల్ గాంధీల చెవిలోనో వేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చి ఉండవచ్చు కదా? 


Related Post