స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళేదెలా?

October 19, 2019


img

ఈ ఏడాది పాఠశాలలకు దసరా శలవులు అక్టోబర్ 13వరకే ఇచ్చినప్పటికీ ఆర్టీసీ సమ్మె కారణంగా శలవులను ప్రభుత్వం 19వరకు పొడిగించింది. అంటే సోమవారం నుంచి మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకొంటాయన్నమాట! కానీ ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వానికి మద్య ప్రతిష్టంభన ఏర్పడటంతో నేటికీ సమ్మె కొనసాగుతూనే ఉంది. అది ఇంకా ఉదృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ కనీసం 30-40 శాతం బస్సులను కూడా నడిపించలేకపోతోంది. సమ్మె ఉదృతమైతే అవి కూడా రోడ్లపైకి రావడం కష్టమే కావచ్చు.

ఈ నేపధ్యంలో సోమవారం నుంచి స్కూళ్ళు కాలేజీలు ప్రారంభం అయితే విద్యార్దులు ఎలా వెళ్ళాలి? ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో తిరుగుతున్నప్పుడే విద్యార్దులకు ఆ బస్సులు సరిపోయేవి కావు ఇప్పుడు అరకొర సర్వీసులతో  ఏవిధంగా పాఠశాలలకు చేరుకోవాలి? ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులలో సమీపంలోని పట్టణాలకు వెళ్ళి చదువుకునేవారి పరిస్థితి ఏమిటి? అలాగే హైదరాబాద్‌ నగరంలో ఉంటూ చుట్టుపక్కల జిల్లాలకు రోజూ బస్సులలో వెళ్ళే ఉపాద్యాయుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం.

ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది కనుక ఇంకా మరికొన్ని రోజులపాటు స్కూళ్ళు, కాలేజీలకు శలవులు పొడిగిస్తే విద్యార్దుల తల్లితండ్రులు ఆగ్రహం చెందవచ్చు. ప్రతిపక్షాలు, హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కనుక సోమవారం నుంచి 100 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. కానీ అది సాధ్యమేనా? కాకుంటే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సోమవారంలోగానే జవాబులు లభించవచ్చు. 


Related Post