తెరాస సర్కార్‌ చుట్టూ శత్రువులే

October 19, 2019


img

తెలంగాణలో బలమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో అవాంఛనీయమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉండటం విశేషం. దీనికి అటు ప్రభుత్వమూ, సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాలు అందరూ సమాన బాధ్యత వహించాల్సిందే. 

ఆర్టీసీ సమ్మె గురించి జేఏసీ నేతలు-ప్రభుత్వం వినిపిస్తున్న భిన్నవాదనలను పక్కన పెడితే, ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో బలహీనపడిన ప్రతిపక్షాలు మళ్ళీ పుంజుకొనేందుకు మంచి అవకాశం కలిగింది. అలాగే సమ్మెతో రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంతో తెరాస ఒంటరిగా మిగిలిపోయింది. తెరాస మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీ కూడా ఆర్టీసీ సమ్మె- కేసీఆర్‌ వైఖరిపై మాట్లాడకుండా మౌనం వహిస్తుండటం గమనార్హం.  

ఈనెల 21న హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలు, త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న ఈ తరుణంలో రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం వలన తెరాస నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని నివారించే ప్రయత్నం చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఇక టీఎన్జీవోలు ఆర్టీసీ కార్మికులతో చేతులు కలపకుండా ఉండేందుకు తెరాస సర్కార్‌ ప్రయత్నించినప్పటికీ వారు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపారు. కనుక రాష్ట్రంలో మిగిలిన సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు అందరూ ఆర్టీసీ కార్మికులతో చేతులు కలిపి సమ్మెలో పాల్గొంటే అది మరో ‘సకల జనుల సమ్మె’గా మారుతుంది. రాష్ట్రాన్ని స్తంభింపజేస్తుంది. అదే జరిగితే ఏమవుతుందో ఊహించడం కష్టం. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోగా రాష్ట్రంలో బలపడి తెరాసను ఓడించి అధికారంలోకి రావాలని కలలు కంటున్న బిజెపికి సిఎం కేసీఆర్‌ చేజెతులా ఇటువంటి గొప్ప అవకాశాన్ని అందించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్‌ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ రాష్ట్ర బిజెపి శ్రేణులు ఆర్టీసీ సమ్మెలో చాలా చురుకుగా పాల్గొంటూ ప్రజలలోకి చొచ్చుకుపోతున్నారు. ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ద్వారా కేంద్రప్రభుత్వం నివేదికలు తెప్పించుకొని రాష్ట్రంలో పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. సమ్మె ఇంకా కొనసాగితే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ సమ్మెపై స్పందించిన తెరాస ఎంపీ కే కేశవరావు, ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు ప్రారంభించాలని సిఎం కేసీఆర్‌కు సూచించారు. కానీ అయన పట్టించుకోలేదు. కనుక సమ్మె ఇంకా కొనసాగితే తెరాసలో నేతలు, మంత్రులు సిఎం కేసీఆర్‌తో విభేదించి మాట్లాడినట్లయితే, ఇప్పటి వరకు ఆర్టీసీకి-ప్రభుత్వానికి మద్య నెలకొన్న సమస్య అప్పుడు తెరాస అంతర్గత సమస్యగా మారి పార్టీలో చీలిక ఏర్పడే ప్రమాదం ఉంటుంది. హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ వంటివారు మౌనం వీడి ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడానికి ముందుకు రావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వధామరెడ్డి కోరుతున్నారు. మంత్రిపదవులు శాస్వితం కావని, ఆర్టీసీని కాపాడేందుకు వారు ముందుకు వస్తే అవసరమైతే మళ్ళీ వారిని భారీ మెజార్టీతో గెలిపించుకొంటామని అశ్వధామరెడ్డి చెప్పడం సిఎం కేసీఆర్‌పై తిరుగుబాటు చేయమని కోరడమేనని అర్ధమవుతూనే ఉంది. అందుకు వారు సిద్దపడతారా లేదా? అనేది పక్కన పెడితే తెరాసకు ఇటువంటి ప్రమాదం ఒకటి పొంచి ఉందని అర్ధమవుతోంది. 

తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పంతాలకు, పట్టింపులతో ఇటువంటి విపత్కర పరిస్థితులను సృష్టించుకొనడం, అయినా సిఎం కేసీఆర్‌ నిర్భయంగా వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యకరమే. చివరికి ఈ అవాంఛనీయ పరిణామాలు దేనికి దారి తీస్తాయో తెలియదు కానీ ఇకనైనా తెరాస సర్కార్‌ సమ్మెకు ముగింపు పలకడం అందరికీ మంచిది లేకుంటే బహుశః తెరాసయే దానికి మూల్యం చెల్లించవలసిరావచ్చు.


Related Post