ఆర్టీసీ సమ్మె..పంతాలతోనే ప్రతిష్టంభన

October 19, 2019


img

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వానికి-ఆర్టీసీ జేఏసీ నేతలకు మద్య ప్రతిష్టంభన ఏర్పడటంతో ఆర్టీసీ సమ్మె మొదలైంది. అయితే తెరాస ఎంపీ కే కేశవరావు, ఆ తరువాత హైకోర్టు సూచనల మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను ఉపసంహరించుకొని ప్రభుత్వంతో చర్చలకు సిద్దమయ్యారు. ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకొన్నప్పటికీ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం (సిఎం కేసీఆర్‌) విముఖత చూపడంతో సమ్మె తీవ్రరూపం దాల్చింది. దానిలో భాగంగానే నేడు తెలంగాణ బంద్‌ కూడా జరుగుతోంది. 

ఆర్టీసీ జేఏసీ నేతలు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ వాదన. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు సమ్మె సాకుతో ఆర్టీసీని ప్రైవేటీకరించి దానిని ‘అస్మదీయులకు’ కట్టబెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. 

 ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలకు అంగీకరించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్న కేసీఆర్‌, ఆర్టీసీ పట్ల ప్రభుత్వ అనుచిత విధానాల కారణంగానే ఆర్టీసీకి నష్టం వస్తోందని వారు వాదిస్తుంటే, దేశంలో మరెక్కడా లేనంతగా టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ మరింత ఎక్కువ జీతాలు కావాలని సమ్మె చేస్తూ చేజేతులా ఆర్టీసీని ముంచుకొంటున్నారని ప్రభుత్వ వాదన. ఇరువర్గాలు మీవల్లే ఆర్టీసీకి నష్టం వస్తోందని పరస్పరం ఆరోపించుకొంటూ, దానిని మేమే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని గట్టిగా వాదిస్తుండటం మరో విచిత్రం.  

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం మొదలైన సమ్మె ఇప్పుడు ఇరువర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎవరూ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. కనుక ఇప్పుడు సమస్యల పరిష్కారం కంటే అహంభావాలు, పంతాలు, పట్టింపుల కారణంగానే ప్రతిష్టంభన కొనసాగుతోందని భావించవచ్చు. కనుక మళ్ళీ హైకోర్టు కల్పించుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపించడం లేదు. 


Related Post