రేపు సమ్మె..బంద్‌..చర్చలు: అశ్వధామరెడ్డి

October 18, 2019


img

శనివారం ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలన్న హైకోర్టు తీర్పును ఆర్టీసీ కార్మిక సంఘాలు స్వాగతించాయి. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వంతో చర్చలకు మేము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నాము. రేపు చర్చలకు పిలిస్తే తప్పకుండా హాజరవుతాము. కానీ సమ్మె.. తెలంగాణ బంద్‌ యధాతధంగా కొనసాగుతాయి. మా సమ్మెకు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేకమంది మద్దతు ఇస్తున్నారు కానీ రాష్ట్రంలోనే కొందరు మౌనం వహిస్తుండటం బాధాకరం. ఆర్టీసీ సమ్మె గురించి కొందరు మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే, ఆర్టీసీ సమస్యల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీష్‌రావు వంటి మరికొందరు మౌనం వహిస్తున్నారు. ఇకనైనా ఆయన మౌనం వీడి మా సమస్యలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పదవులు శాశ్వితం కావు. ఆర్టీసీ సంస్థ శాస్వితం. దానిని కాపాడుకోవడానికి మేము చేస్తున్న పోరాటంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని మేమే భారీ మెజార్టీతో గెలిపించుకొంటాము. 

తెలంగాణ ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయని ఆనాడు కేసీఆర్‌ అన్నారు కానీ ఇప్పుడు అదే కేసీఆర్‌ మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్డున పడేయడానికి వెనకడటం లేదు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోవడం లేదు మంత్రులెవరూ కూడా కనీసం స్పందించడం లేదు. ప్రభుత్వం ఒత్తిడికి మంత్రులు లొంగిపోయారేమో కానీ ఆర్టీసీ కార్మికులు నాయకులు, కార్మికులు లొంగలేదు. ఆర్టీసీని కాపాడుకోవడానికి మేము చేస్తున్న పోరాటంపై తెలంగాణ సమాజం మౌనం వహిస్తోంది కానీ మా గొంతులు మూగపోలేదు. ఎన్ని కష్టాలు, సవాళ్ళు ఎదురవుతున్న ధైర్యంగా ముందుకు సాగుతూనే ఉన్నాము. 

ఆర్టీసీ కార్మికుల బలిదానాలు మా హృదయాలను కలచివేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. చివరి వరకు ప్రభుత్వంతో పోరాడి ఆర్టీసీని కాపాడుకొందాము...మన సమస్యలను, డిమాండ్లను పరిష్కరించుకొందాము. 

మేము రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలని కోరుకొంటున్నాము కానీ 4 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రంలో ప్రభుత్వం నానాటికీ ఆర్టీసీ బస్సులు సంఖ్యను తగ్గిస్తోంది.. ఎందుకు? ఆర్టీసీని ప్రైవేటీకరించబోమని చెపుతూ 50 శాతం ప్రైవేటీకరిస్తున్న సిఎం కేసీఆర్‌ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. మా జీవితాలతో చెలగాటం ఆడొద్దని సిఎం కేసీఆర్‌ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. 


Related Post