పువ్వాడకు గవర్నర్‌ తమిళిసై ఫోన్‌!

October 17, 2019


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం రాష్ట్ర రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్‌ చేసి ఆర్టీసీ సమ్మె గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, వాటిపై ప్రభుత్వ వైఖరి, రాష్ట్రంపై సమ్మె ప్రభావం, ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి పూర్తి వివరాలు ఆమెకు తెలియజేసేందుకు మంత్రి పువ్వాడ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆమె వద్దకు పంపించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఇప్పటికే ఆమెను కలిసి తమ డిమాండ్లను వాటిపై ప్రభుత్వ వైఖరిని ఆమెకు తెలియజేశారు. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో సిఎం కేసీఆర్‌పై రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఆమెకు ఫిర్యాదు చేశారు. 

ఆ తరువాత ఆమె డిల్లీ వెళ్ళి ఆర్టీసీ సమ్మె, దానిపై ప్రభుత్వ వైఖరి, సమ్మె కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు వివరించి వచ్చారు కనుక మళ్ళీ ఆ వివరాలను రవాణామంత్రిని అడిగి తెలుసుకోవలసిన అవసరం లేదు. కనుక ఆర్టీసీ సమ్మెపై కేంద్రప్రభుత్వం అభిప్రాయాన్ని లేదా సూచనలను తెలియజేసేందుకే ఆమె రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్‌ చేసి ఉండవచ్చు. కనుక ఈ సమ్మె వ్యవహారం త్వరలో కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Related Post