నేనే రాజు...నేనే మంత్రి అంటే కుదరదు: అశ్వథామరెడ్డి

October 17, 2019


img

సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెపై మళ్ళీ మరోమారు తన వైఖరిని స్పష్టం చేయడంతో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎంతో పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తే కుదరదు. తెరాసలో కొందరు ఎమ్మెల్యేలు మా సమ్మె పట్ల సానుకూలంగా ఉన్నారు కానీ మౌనం వహిస్తున్నారు. మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, జగదీష్ రెడ్డి మౌనం వీడి ఈ సమస్యపై ధైర్యంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో మేధావులు కూడా మౌనం వీడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ తన మొండివైఖరి మానుకోకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదు. ఆనాడు ఎన్టీఆర్ అంతటివారే సంక్షోభం ఎదుర్కొన్నారు. సిఎం కేసీఆర్‌ అందుకు మినహాయింపు కాదు. ప్రభుత్వాధినేతలు వస్తుంటారు...పోతుంటారు కానీ ఆర్టీసీ వంటి వ్యవస్థలు మాత్రం శాస్వితంగా ఉంటాయి. అటువంటి సంస్థల మూలాలను దెబ్బతీసి వాటి ఆస్తులను కొల్లగొట్టాలని ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోము. మా డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె కొనసాగిస్తాము. అవసరమైతే ప్రభుత్వంతో న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోము. కానీ నేటికీ మేము ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నాము. పోలీసులు నా ఫోన్‌ ట్యాపింగ్ చేస్తుండటం చాలా బాధాకరం,” అని అన్నారు. 



Related Post