అశ్వథామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

October 17, 2019


img

ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి కేసీఆర్‌ మంత్రివర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేయడంతో అశ్వథామరెడ్డి కూడా తమ వైఖరిని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మా డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తాము. ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్ళేందుకు సిద్దంగానే ఉన్నాము కానీ ప్రభుత్వంలో ‘బంగారి తెలంగాణ బ్యాచ్’ మంత్రులతో కాక ‘ఉద్యమ తెలంగాణ మంత్రుల’తో మాత్రమే మేము చర్చలకు అంగీకరిస్తాము,” అని అన్నారు. 

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలే జరుపబోమని సిఎం కేసీఆర్‌ చెపుతుంటే, ఎప్పుడు చర్చలు మొదలైనా ‘ఉద్యమ తెలంగాణ మంత్రుల’తో మాత్రమే చర్చలకు అంగీకరిస్తామని అశ్వథామరెడ్డి ప్రకటించడం విశేషం. 

రాష్ట్రంలో తెరాసను రాజకీయామ్గా బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో ‘బంగారి తెలంగాణ సాధన కోసం’ అంటూ ఇతర పార్టీల నుంచి తలసాని, ఎర్రబెల్లి వంటి కొంతమందిని నేతలను తెరాసలో చేర్చుకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమాలతో సంబందం లేని అటువంటివారినే తెరాసలో ‘బిటి బ్యాచ్’ అని, తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిపదవులు చేపట్టిన కేటీఆర్‌, హరీష్‌రావువంటి వారిని ‘యుటి బ్యాచ్’ (ఉద్యమ తెలంగాణ మంత్రులు)గా తెరాసలో రెండు అప్రకటిత వర్గాలున్నాయి. వాటి గురించి అందరికీ తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ ఈవిధంగా బహిరంగంగా ప్రస్తావించలేదు. ఇప్పుడు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి ప్రకటించడం మరో కొత్త చర్చకు, వివాదానికి దారితీయడం ఖాయం. మంత్రులు ఎర్రబెల్లి, తలసాని సమ్మె చేస్తున్న కార్మికులలో విభేధాలు సృష్టించేలా మాట్లాడుతుంటే, ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి తెరాసలో చిచ్చు రగిలించే ప్రయత్నం చేయడం విశేషం.


Related Post