టిఎస్ ఆర్టీసీ కార్మికులకు త్వరలో జీతాలు చెల్లింపు

October 16, 2019


img

సమ్మె చేస్తున్న 49,190 మంది ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం ఇంతవరకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోవడంతో ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. మరొక కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు కానీ తృటిలో కాపాడబడ్డాడు. 

ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మె మొదలుపెట్టారు. కనుక ఆర్టీసీ సమ్మెకు, అంతకు ముందు పనిచేసిన నెలరోజులకు జీతాల చెల్లింపుకు అసలు సంబందమే లేదని అర్దమవుతూనే ఉంది. కానీ సమ్మె చేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించబోమని సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పడంతో ప్రభుత్వాదేశాలతోనే ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించలేదని స్పష్టమయ్యింది. 

దాంతో జీతాలు చెల్లింపుకు కూడా ఆర్టీసీ కార్మికులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. వారి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులకు సోమవారంలోగా జీతాలు చెల్లించాలని ఆదేశించింది. అందుకుఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. ఆర్టీసీ కార్మికులకు యధావిధిగా సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించి ఉండి ఉంటే నేడు హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవలసిన దురవస్థ ఉండేది కాదు. ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు కదా? 

జీతాలు చెల్లించకుండా ఆర్ధికంగా ఇబ్బందులు పడేలా చేసి, ఉద్యోగాలు ఊడిపోయాయని బెదిరిస్తూ సమ్మె చేస్తున్న కార్మికులను లొంగదీసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడమే కాకుండా హైకోర్టు చేత ఈవిధంగా పదేపదే మొట్టికాయలు కూడా వేయించుకొంటూ అభాసుపాలవుతోంది.  

హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నాక ఇప్పుడు జీతాలు చెల్లించడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది గానీ పోయిన ఆ రెండు ప్రాణాలను తిరిగి తీసుకురాలేదు కనుక ఆ రెండు కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత కూడా ఆర్టీసీ యాజమాన్యానిదే. మళ్ళీ దాని కోసం వారు హైకోర్టుకు వెళ్ళకమునుపే ఆర్టీసీ యాజమాన్యం నిర్ధిష్టమైన ప్రకటన చేస్తే అందరూ హర్షిస్తారు.


Related Post