కేశవ్‌రావు యూ టర్న్?

October 15, 2019


img

తెరాస పార్లమెంటరీ నేత కే.కేశవ్‌రావు (కెకె) నిన్న హటాత్తుగా మీడియా ముందుకు వచ్చి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక్క డిమాండ్ తప్ప మిగిలినవాటిపై ప్రభుత్వంతో చర్చించవచ్చునని అన్నారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి వెంటనే స్పందిస్తూ ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. కనుక నేడో రేపో మళ్ళీ ప్రభుత్వం-ఆర్టీసీ కార్మిక సంఘాల మద్య చర్చలు మొదలవుతాయని అందరూ భావించసాగారు. 

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం ఉదయం కెకె ఇంటికి వెళ్ళి ఆర్టీసీ సమ్మె గురించి చర్చించారు. అయితే కెకె హటాత్తుగా యూ టర్న్ తీసుకోవడం చూసి కొండా ఆశ్చర్యపోయారు. పార్టీలో సీనియర్ నేతనైన తాను ఆర్టీసీ సమ్మెతో ఏర్పడిన విపత్కర పరిస్థితులను చూస్తి వ్యక్తిగతంగా స్పందించాను తప్ప ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని తనను సిఎం కేసీఆర్‌ ఆదేశించలేదని కెకె అన్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదనే ఉద్దేశ్యంతోనే తాను మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకువచ్చానని కెకె చెప్పినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ ఏవిధంగా ముందుకు వెళ్లాలనుకొంటున్నారో తనకు తెలియదన్నారు కెకె.

సాధారణంగా తెరాసలో ఎంత సీనియర్ నేతైనా సరే సిఎం కేసీఆర్‌ ఆదేశం లేనిదే ఇటువంటి ప్రకటనలు చేయరు కనుక ఆయన సిఎం కేసీఆర్‌ సూచన మేరకే ఆ ప్రతిపాదన చేశారని అందరూ భావించారు. కానీ తనను సిఎం ఆదేశించలేదని ఇప్పుడు కెకె అంటున్నారు. అంటే ఆర్టీసీ కార్మికులతో చర్చలపై కెకె యూ టర్న్ తీసుకున్నారా లేక ప్రభుత్వమే యూ టర్న్ తీసుకొందా? అనే ప్రశ్నకు తెరాసయే జవాబు చెప్పాలి. 

ప్రభుత్వానికి-ఆర్టీసీ కార్మికులకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్దంగా ఉన్నాననే కెకె ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు ఒక మెట్టు దిగి చర్చలకు సిద్దమయ్యారు. ప్రభుత్వం ఆ అవకాశాన్ని సద్వినియోగించుకొని ఉండి ఉంటే అందరికీ మేలు కలిగేది. కానీ సమ్మెను కొనసాగనీయడం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా నష్టపోతున్నారు. కనుక ఇకనైనా కెకె ద్వారా ముందుకు సాగడమే అందరికీ మంచిది. 


Related Post