తెలంగాణ గవర్నర్‌ తమిళిసై డిల్లీకి పయనం

October 15, 2019


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్రప్రభుత్వం నుంచి పిలుపురావడంతో మంగళవారం మధ్యాహ్నం హుటాహుటిన డిల్లీ బయలుదేరివెళ్లారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సోమవారం ఆమెను కలిసి తెరాస సర్కార్‌పై ఫిర్యాదు చేసిన తరువాతే ఆమెకు డిల్లీ నుంచి పిలుపురావడంతో ఆమెతో ఇదే విషయంపై చర్చించేందుకు వెళ్ళి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ, 4 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో తెరాస సర్కార్ కటినంగా వ్యవహరిస్తునందున ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. సిఎం కేసీఆర్ వైఖరిపై రాష్ట్ర బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, సిఎం కేసీఆర్ మళ్ళీ వారిపై ఎదురుదాడి చేశారు. కేంద్రప్రభుత్వం రైల్వేలను, ఎయిర్ ఇండియా సంస్థను, చివరికి సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రైవేటీకరిస్తోందని, వాటి గురించి మాట్లాడని బీజేపీ నేతలకు ఆర్టీసీ ప్రైవేటీకరణ గురించి మాట్లాడే నైతికహక్కు లేదని సిఎం కేసీఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.

కనుక ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా కేంద్రప్రభుత్వం తెలుసుకోవాలనుకోవడం సహజమే. అయితే ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలనుకొంటోందా లేక కేవలం పరిస్థితులను సమీక్షించడానికే ఆమెను డిల్లీకి పిలిచిందా? అనే విషయం ఆమె డిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత తెలియవచ్చు.


Related Post