హుజూర్‌నగర్‌ ప్రజలకు ఉత్తమ్ ఏం చెప్పగలరు?

October 15, 2019


img

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు 1999, 2004, 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిందేమీలేదని అందుకే రోజుకో మాట, అబద్దం చెపుతూ ప్రజలను మభ్యపెట్టి తన భార్య పద్మావతీ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని జిమ్మికులు చేసినా ఈసారి తెరాస గెలుపు ఖాయమని అన్నారు. హుజూర్‌నగర్‌ ప్రజలు సిఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని, తమ నియోజకవర్గం అభివృద్ధిని కోరుకొంటున్నారని కనుక తెరాస అభ్యర్ధి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని జగదీష్ రెడ్డి అన్నారు. 

హుజూర్‌నగర్‌ నుంచి శాసనసభకు ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి గెలిచినందున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికవడం వలన రాజకీయంగా ఆయన మరో మెట్టు పైకి ఎదగగలిగారు కానీ దాని కోసం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు తెచ్చిపెట్టి పార్టీకి అగ్నిపరీక్ష పెట్టారని చెప్పకతప్పదు. ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోతే హుజూర్‌నగర్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి చేజేతులా తెరాసకు అప్పగించినట్లే భావించవచ్చు.    

ఇక నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆయనపై తెరాస చేస్తున్న విమర్శలు కూడా ప్రజలను ఆలోచింపజేయకమానవు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షపార్టీగా మిగిలిపోవడం, ఫిరాయింపుల కారణంగా నానాటికీ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుండటం, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నందున నియోజకవర్గం అభివృద్ధి కంటే పార్టీ సమస్యలు, పార్టీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసిరావడం వంటివి ఉన్నాయి. కనుక హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఆయన తన నియోజకవర్గం అభివృద్ధికి ఏమైనా చేశారా లేదా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఒకవేళ నియోజకవర్గం అభివృద్ధి చేసి ఉండి ఉంటే ఎన్నికల ప్రచారంలో వాటి గురించి గట్టిగా చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓట్లు అడగవచ్చు. లేకుంటే మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు తెరాస సర్కార్‌పై ఆరోపణలు చేస్తూ, ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ వైఖరిని  విమర్శిస్తూ ప్రజలను ఆకట్టుకోవలసి ఉంటుంది. అంతకు మించి వేరే మార్గం లేదు. కానీ ఆయన వాదనలతో నియోజకవర్గం ప్రజలు ఏకీభవిస్తారా లేదా అనే విషయం ఈనెల 24న ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది. 

కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతీ రెడ్డిని గెలిపించడం వలన ఆమె ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గం అభివృద్ధి చేయలేరని  కనుక అధికార తెరాస అభ్యర్ధి సైదిరెడ్డినే గెలిపించుకుంటేనే తమకు మేలు కలుగుతుందని హుజూర్‌నగర్‌ప్రజలు భావించినా ఆశ్చర్యం లేదు. ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్‌నగర్‌ ప్రజలపై పడినట్లయితే కాంగ్రెస్‌కు, పడకపోయినట్లయితే తెరాసకు మేలు కలుగవచ్చు.


Related Post