తెరాస నోరు తెరిచి అడిగినందుకు....

October 14, 2019


img


   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు తెరాస ఒంటరిగానే పోటీ చేస్తోంది. మజ్లీస్ పార్టీతో స్నేహం కొనసాగిస్తున్నప్పటికీ తెరాస ఏనాడూ ఆ పార్టీ సాయం అర్ధించలేదు. ఇంతవరకు ప్రతీ ఎన్నికలలోను తెరాస ఒంటరిగానే పోటీ చేస్తున్నప్పటికీ ఒక్క లోక్‌సభ ఎన్నికలలో తప్ప మిగిలిన అన్నిటిలో తిరుగులేని విజయాలు సాధిస్తూనే ఉంది. కానీ మొట్టమొదటిసారిగా తెరాస హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో సిపిఐ మద్దతు కోరింది. 

రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా నిలిచిన తెరాస, ఉపఎన్నికల కోసం సిపిఐ మద్దతు కోరడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఏదైతేనేమీ తెరాస అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించి మద్దతు ప్రకటించింది. కానీ ఆ తరువాత ఆర్టీసీ సమ్మె విషయంలో సిఎం కేసీఆర్‌ కటినవైఖరి అవలంభించడం, ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో తెరాస సర్కార్‌పై సిపిఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికుల పట్ల సిఎం కేసీఆర్‌ వైఖరికి  నిరసనగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగించాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకొన్నామని చాడా వెంకట్ రెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తామనే విషయం ప్రకటిస్తామని చెప్పారు. 

వాస్తవానికి 10 రోజుల క్రితం అంటే ఆర్టీసీ సమ్మె మొదలవక మునుపు హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల బరిలో కాంగ్రెస్‌, బిజెపిల కంటే తెరాసయే ఎక్కువ బలంగా ఉంది. కనుక సిపిఐ మద్దతు కోరవలసిన అవసరమే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఎందుకో సిపిఐ మద్దతు అడిగింది. సిపిఐ అందుకు అంగీకరించింది. 

ఆ తరువాత ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి తెరాసకు ఎదురుగాలి వీయడం మొదలైంది. కనుక ఇప్పుడు తెరాసకు సిపిఐ మద్దతు చాలా అవసరం. కానీ సరిగ్గా ఇప్పుడే సిపిఐ మద్దతు ఉపసంహరించుకొంది. దాంతో మొట్టమొదటిసారిగా నోరు తెరిచి మద్దతు అడిగి తెరాస అభాసుపాలైంది. పైగా ఇప్పుడు సిపిఐ కూడా శత్రువుగా మారిపోయింది. 

ఈనెల 21న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఆలోగా తెరాస సర్కార్‌ ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా ముగించక తప్పదు లేకుంటే ఉపఎన్నికలలో తెరాస నష్టపోయే ప్రమాదం ఉంటుంది. బహుశః అందుకే నేడు సీనియర్ తెరాస నేత కే కేశవరావు చేత రంగప్రవేశం చేయించి ఉండవచ్చు. మరి ఈ సమస్యను కెకె ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి.


Related Post