కేసీఆర్‌ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?

October 09, 2019


img

ఆర్టీసీ సమ్మె విషయంలో సిఎం కేసీఆర్‌ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ ఒక ముఖ్యమంత్రిలాగ కాక ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో కొత్తవారిని నియమించుకొంటామని చెప్పడం ఆయన నియంతృత్వపోకడలకు తాజా నిదర్శనం. ఆర్టీసీ సమ్మె విషయంలో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాము. ఈ వ్యవహారంలో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారని మేము భావిస్తున్నాము,” అని అన్నారు. 

ఆర్టీసీ సమ్మెతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ సమస్యను ఏదోవిధంగా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులను నడిపిస్తుండటం వరకు బాగానే ఉంది కానీ సమ్మె చేస్తున్న కార్మికులందరూ ఉద్యోగాలు కోల్పోయారని సిఎం కేసీఆర్‌ చెప్పడమే విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులు సిఎం కేసీఆర్‌ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. కనుక ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతున్న మాటలు, తీసుకొంటున్న నిర్ణయాలు కేవలం ఆర్టీసీ కార్మికులపైనే కాక ఇతర ఉద్యోగ, కార్మిక సంఘాలపై కూడా తప్పకుండా ప్రభావం చూపకమానవు. భవిష్యత్‌లో సిఎం కేసీఆర్‌ తమతో కూడా ఇదేవిధంగా ప్రవర్తించవచ్చుననే అనుమానం లేదా భావన వారిలో కలగడం సహజం. కనుక సిఎం కేసీఆర్‌ కటిన వైఖరి వలన త్వరలో జరుగబోయే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు, వాటి తరువాత వచ్చే మున్సిపల్ ఎన్నికలలో తెరాసకు ఎంతో కొంత నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు. అదే కనుక జరిగితే కృష్ణసాగర్ రావు చెప్పినట్లు సిఎం కేసీఆర్‌ సెల్ఫ్ గోల్ చేసుకొన్నట్లే అవుతుంది. ఆర్టీసీ సమ్మె పట్ల సిఎం కేసీఆర్‌ వైఖరి సరైనదా కాదా? అనే ప్రశ్నకు ప్రజలే తీర్పు చెప్పాలి.


Related Post