ఆర్టీసీ విభజన ఎలా అంటే....

October 09, 2019


img

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ సంస్థలో పెనుమార్పులు చేయడానికి సిద్దం అవుతున్నారు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించడం ఈ సంస్యలకు పరిష్కారం కాబోదు కనుక ఆర్టీసీలో 50 శాతం సొంత బస్సులు, 30 శాతం అద్దెబస్సులను మిగిలిన 20 శాతం ప్రైవేట్ బస్సులను నడిపించాలని సిఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించారు. తద్వారా ఆర్టీసీలో నష్టాలను తగ్గించి లాభాల బాటలోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంటే ఆర్టీసీలో సగం బస్సులు ప్రైవేట్‌వి నడుస్తాయని స్పష్టం అవుతోంది.

అయితే వాటికి కూడా టికెట్ల ధరలు, పెంపుతో సహా అన్నీ ఆర్టీసీ నియమనిబందనలే వర్తింపజేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలతో పాటు ముఖ్యమైన అన్ని మార్గాలలో ప్రైవేట్ బస్సులకు కూడా అనుమతించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలాగే రాబడి ఎక్కువగా ఉందని మారుమూల ప్రాంతాలకు కూడా ‘పల్లెవెలుగు’ ప్రైవేట్ బస్సులు నడిపించాలని నిర్ణయించారు.

రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆర్టీసీ ప్రక్షాళన, కొత్త నియామకాలు, 20 శాతం ప్రైవేటీకరణ, ఆర్టీసీ-ప్రైవేట్-అద్దె బస్సులను నడిపించే మార్గాలపై అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా సిఎం కేసీఆర్‌ అంతిమ నిర్ణయం తీసుకొంటారు. 

ప్రభుత్వం విధించిన గడువు ముగిసేసరికి విధులలో చేరిన 1200 మందిని మాత్రమే ఆర్టీసీలో ఉద్యోగులుగా భావిస్తామని, మిగిలిన 48,200 మంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకున్నట్లు భావిస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పినప్పటికీ, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేసి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకొనే ప్రయత్నాలు చేస్తే ఆర్టీసీ కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవవచ్చు కనుక తాత్కాలిక ప్రాతిపదికనే నియామకాలు చేపట్టవచ్చు.


Related Post