భారత్‌ అమ్ములపొదిలో రఫెల్ యుద్ధవిమానం

October 09, 2019


img

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యాధునికమైన రఫెల్ యుద్ధవిమానం భారత్‌ వాయుసేన చేతికి అందింది. భారత రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఫ్రాన్స్ దేశంలో మేరినాక్ వద్ద గల డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు వెళ్ళి మంగళవారం ఉదయం దానిని అధికారికంగా స్వీకరించారు. నిన్న దసరా పండుగ కూడా కలిసివచ్చినందున అక్కడే దానికి ఆయుధపూజ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ రక్షణమంత్రి, డసాల్ట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్, భారత్ వాయుసేన అధికారులు, పైలట్లు తదితరులు పాల్గొన్నారు. 

రూ.59,000 కోట్లు వ్యయంతో భారత్‌ మొత్తం 36 రఫెల్ యుద్ధవిమానాలకు ఆర్డర్ ఇవ్వగా వాటిలో ఒప్పందం ప్రకారం మొదటి విమానాన్ని నిన్న భారత్‌కు అప్పగించింది. మిగిలిన యుద్ధవిమానాలలో మరికొన్ని 2022 లోగా అందనున్నట్లు సమాచారం. భారత్‌ వాయుసేనకు చెందిన పైలట్లు అక్కడే ఉండి ఫ్రాన్స్ పైలట్లతో కలిసి 1500 గంటలు రఫెల్ యుద్ధవిమానాన్ని నడిపడంలో పూర్తి శిక్షణపొందుతారు. ఆ సమయంలో దాని తీరుతెన్నులను, శక్తిసామర్ధ్యాలను స్వయంగా అంచనావేసి ఒక సమగ్ర నివేదికను రూపొందించి వాయుసేన అధిపతికి అందజేస్తారు. దాని ఆధారంగా ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే చేసిన తరువాత వచ్చే ఏడాది మే నెలలోగా రఫెల్ యుద్ధవిమానాన్ని పంజాబ్‌లోని అంబాలలో గల భారత్‌ వాయుసేన ఎయిర్ బేస్‌కు మన పైలట్లే స్వయంగా తీసుకువస్తారు.  

చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి నిత్యం సవాళ్ళు ఎదుర్కొంటున్న భారత్‌కు వాటిని కట్టడిచేయగల ఈ అత్యాధునిక యుద్దవిమానాలు సమకూర్చుకోవడం అవసరం అని భావిస్తోంది. ఆసియా ఖండంలో రఫెల్ ‘గేమ్ ఛేంజర్’ కాగలదని డసాల్ట్ యాజమాన్యం నమ్మకంగా చెపుతోంది. దీనిలో అమర్చిన స్కాల్ప్ క్షిపణులు 300 కిమీ దూరంలో ఉన్న లక్ష్యాలను అవలీలగా చేదించగలవు. 


Related Post