5వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

October 09, 2019


img

ప్రభుత్వ హెచ్చరికలు, ఒత్తిళ్ళ మద్య తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 5వ రోజుకు చేరుకొంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో కొత్తవారిని నియమించుకుంటామని సిఎం కేసీఆర్‌ హెచ్చరించినప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం భయపడకుండా సమ్మెను ఇంకా ఉదృతం చేస్తున్నారు. 

ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలన్నీ ఇప్పటికే మద్దతు ప్రకటించినందున, కార్మిక సంఘాల నేతలు నేడు జిల్లా స్థాయి ప్రతిపక్షపార్టీ నేతలతో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చించనున్నారు. వారి సాయంతో రాష్ట్ర ప్రజల మద్దతు కూడా గట్టుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. అలాగే వివిద ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు ఉపాద్యాయసంఘాల మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ వారి ప్రయత్నాలు ఫలించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చినట్లయితే రాష్ట్రంలో సరికొత్త పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. 

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో కొత్తవారిని నియమించుకునేందుకు, ఆర్టీసీని 20 శాతం ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ కార్మికులపై నానాటికీ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తుంటే, ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్షాలను, ప్రభుతోద్యోగులను, ఉపాద్యాయ సంఘాలను కూడగట్టుకొని ప్రభుత్వంతో అంతిమ పోరాటానికి సిద్దం అవుతున్నారు. అవాంఛనీయమైన ఈ పరిణామాలు చివరికి ఎటు దారి తీస్తాయో తెలియదు కానీ సమ్మె వలన సామాన్యప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఎప్పటిలాగే మరో వారం పది రోజుల సమ్మె తరువాత మళ్ళీ ఇరువర్గాలు రాజీపడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవడం మంచిది.


Related Post