కేసీఆర్‌కు బస్తీమే సవాల్!

October 07, 2019


img

డిమాండ్ల సాధనకు మొదలైన ఆర్టీసీ సమ్మె మూడు రోజుల వ్యవధిలోనే క్లైమాక్స్ కు చేరుకోవడం విశేషం. ఒకవేళ ఆర్టీసీ ఐకాస నేతలతో ప్రభుత్వం చర్చలు కొనసాగించి ఉండి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేదేమో కానీ సమ్మె చేస్తున్న 48,000కు పైగా కార్మికులందరినీ ఒకేసారి ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని సిఎం కేసీఆర్‌ హెచ్చరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆర్టీసీని పాక్షికంగా ప్రైవేట్ పరం చేయడానికి సిఎం కేసీఆర్‌ చేస్తున్న ఆలోచనలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పించినట్లయింది. 

ఆర్టీసీ సమ్మెతో సిఎం కేసీఆర్‌  అహం దెబ్బతిన్నట్లు వ్యవహరిస్తుంటే, ఆయన చర్యలు కార్మికులను ఇంకా రెచ్చగొట్టినట్లవుతుండటంతో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం- ఆర్టీసీ కార్మికుల మద్య యుద్ధవాతావరణం ఏర్పడింది. 

సిఎం కేసీఆర్‌ హెచ్చరికలు, నిర్ణయాలపై ఆర్టీసీ కార్మికులు, ఐకాస నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “దశాబ్ధాల తరబడి పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులను తొలగించి మా స్థానంలో కొత్తవారిని నియమించుకొంటామని సిఎం కేసీఆర్‌ చెప్పడం ఆయన అహంకారానికి అద్దం పడుతోంది. ఆయనకు దమ్ముంటే కార్మికులందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయాలి. తీసుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాము. అవి పట్టుకొని న్యాయపోరాటం చేస్తాము. న్యాయస్థానంలోనే అమీతుమీ తేల్చుకొంటాము. కేసీఆర్‌ ఒకప్పుడు ఉద్యమాలు చేశారు. కానీ ఇప్పుడు ఉద్యమాలు పేరు చెపితే భయపడుతున్నారు. ఆయనకు ఉద్యమఫోబియా పట్టుకొంది. అందుకే మా పోరాటాన్ని ఏదోవిధంగా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు మేమందరం ఆర్టీసీని కాపాడుకోవడానికి పోరాడుతున్నాము ఇక నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా పోరాడుతాము,” అని అన్నారు.


Related Post