అమరావతికి మట్టి నీళ్ళు మరి గజ్వేల్ కి ఏమిస్తారో?

August 03, 2016


img

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపనకి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటిస్తారని ఆ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆశగా ఎదురుచూస్తే, ఆయన గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. నేటికీ ఏపికి ప్రత్యేక హోదా, నిధుల కోసం ఆ రాష్ట్ర ఎంపిలు కేంద్రంతో పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రయోజనం లేదు.  

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ళ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఆగస్ట్ 7న గజ్వేల్లో మిషన్ భగీరథ పధకానికి ప్రారంభోత్సవం చేస్తారు. ప్రభుత్వం అందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలంగాణకి ఏమైనా వరాలు ప్రకటిస్తారా లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్ళుగా ఉమ్మడి హైకోర్టుని విభజించమని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తులు చేసింది. కానీ ఇంతవరకు ఆ పని మొదలు పెట్టలేదు. ఇటీవల తెలంగాణ  న్యాయవాదులు దాని కోసం ఉద్యమించిన తరువాత, తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. కనుక ఆగస్ట్ 7న ప్రధాని నరేంద్ర మోడీ గజ్వేల్ కి వచ్చినప్పుడు హైకోర్టు విభజనపై నిర్దిష్టమైన ప్రకటన చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

హైకోర్టు విభజన చేయాలంటే అందుకు ఏపి సిఎం చంద్రబాబు సహకారం చాలా అవసరం. కానీ ప్రస్తుతం ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు వగైరా అంశాలపై టిడిపికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. కనుక హైకోర్టు విభజనకి చంద్రబాబు కేంద్రానికి సహకరించకపోవచ్చు. గత రెండు, మూడు వారాలలో కేంద్రం నుండి కానీ ఏపి ప్రభుత్వం నుండి గానీ, హైకోర్టు విభజన గురించి ఎటువంటి సానుకూల సంకేతాలు కనబడలేదు. కనుక మోడీ గజ్వేల్ వచ్చినప్పుడు ఒక కాళీ బిందెని తెచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ చేతిలో పెడతారేమో?


Related Post