ఆలోచన ఆశయం మంచివే కానీ...

September 20, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాలకు జీవధారవంటి అమూల్యమైన గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలిస్తే మరింత సద్వినియోగించుకోవచ్చుననే సిఎం కేసీఆర్‌ ప్రతిపాదనకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాంతో రెండు రాష్ట్రాల సాగునీటి అధికారులు, ఇంజనీర్లు వరుసగా సమావేశాలు నిర్వహించుకొని ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై లోతుగా చర్చించారు. వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఇది చాలా మంచి ఆలోచనే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే చాలా భారీ ప్రాజెక్టు అవుతుందని నిపుణులు చెపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.85,000 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కనుక ఈ కొత్త ప్రాజెక్టు కనీసం 1.50 లక్షల కోట్లు ఉంటుందనుకుంటే, దానిని ఇరు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అది ఏ ప్రాతిపదికన, ఎంత నిష్పత్తిలో భరిస్తారనేది నిపుణులు నిర్ణయిస్తారు కనుక దాని గురించి ఇప్పుడు చర్చ అనవసరం. 

కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో చూసినట్లయితే, ఈ ప్రాజెక్టుకు భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, కాళేశ్వరం ప్రాజెక్టులకే అనేక సమస్యలు, సవాళ్ళు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, నిలకడలేని రాజకీయ వాతావరణంలో రెండు రాష్ట్రాలు కలిసి ఇటువంటి భారీ ప్రాజెక్టును చేపడితే అది సవ్యంగా పూర్తవుతుందా?

గతంలో ఒక ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను, మొదలుపెట్టిన ప్రాజెక్టులను తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించే సాంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారగానే ఆ ప్రాజెక్టులపై ఎన్ని వేలకోట్లు ఖర్చు చేసినప్పటికీ నిలిపివేయడానికి ప్రభుత్వాలు వెనకాడటం లేదు. అందుకు ఉదాహరణగా తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు, ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు నిలిపివేయడమే ప్రత్యక్ష సాక్ష్యాలుగా మన కళ్లెదుటే ఉన్నాయి. కనుక ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన తరువాత ఒకవేళ భవిష్యత్‌లో ఏపీ లేదా తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారితే ఇది ఏవిధంగా  ముందుకు సాగుతుంది? అని ఆలోచించవలసి ఉంది. 

ఇంతకు ముందు ఏపీలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఇరువురు ముఖ్యమంత్రుల పంతాలు, పట్టింపులు, రాజకీయ విద్వేషాల కారణంగా విభజన సమస్యలనే పరిష్కరించుకోలేక 5 ఏళ్ళపాటు చేతులు ముడుచుకు కూర్చున్న సంగతి అందరికీ తెలుసు. రాజకీయ విభేధాల కారణంగా చిన్న చిన్న విభజన సమస్యలనే పరిష్కరించుకోలేనప్పుడు ఇంత భారీ ప్రాజెక్టును కలిసి నిర్మించుకొని దానిని దీర్గకాలం సమర్ధంగా నిర్వహించడం సాధ్యమేనా? ఒకవేళ కాకపోతే అప్పుడు ఎవరు నష్టపోతారు? ఆ నష్టం ఎవరు భరిస్తారు? అని ఆలోచించవలసి ఉంటుంది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఒప్పందాలు  చేసుకొంటామని సిఎం కేసీఆర్‌ చెపుతున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ప్రస్తుత ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను చూస్తుంటే మున్ముందు ఈ ప్రాజెక్టుకు అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కనుక ఈ ప్రాజెక్టులో ఆర్ధిక, సాంకేతిక అంశాల కంటే రాజకీయకోణంలో నుంచి ఎక్కువగా చూసి దానిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించగలమని దృవీకరించుకున్న తరువాతే దీనిపై అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. లేకుంటే రెండు రాష్ట్రాలకు ఇది గుదిబండగా మారడమే కాకుండా మళ్ళీ పరస్పరం కత్తులు దూసుకొనే యుద్ధభూమిగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.


Related Post