మంత్రిపై హర్షకుమార్ సంచలన ఆరోపణ

September 19, 2019


img

ఇటీవల గోదావరిలో బోటు మునక ప్రమాదంలో 37 మంది గల్లంతవగా నేటివరకు 21 మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. మిగిలిన వారికోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. నదిలో సుమారు 300 అడుగుల లోతులో మునిగిపోయున్న బోటును బయటకు తీస్తేగానీ దానిలోపల ఎవరైనా చిక్కుకొని చనిపోయున్నారా లేదా అనే విషయం తేలదు. కానీ అంతలోతు నుంచి బోటును బయటకు తీయడం అసంభవం అన్నట్లు అధికారులు మాట్లాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఈ నేపద్యంలో మాజీ కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బోటులో మొత్తం 72 మంది ఉన్నట్లు అధికారులు చెపుతున్నప్పటికీ వాస్తవానికి మొత్తం 93 మంది ఉన్నారని అన్నారు. బోటు సామర్ధ్యానికి మించి పయనిస్తూ దేవీపట్నం చేరుకున్నప్పుడు స్థానిక ఎస్ఐ బోటును నిలిపివేయించగా, ఏపీ పర్యాటకమంత్రి అవంతి శ్రీనివాస్ నుంచి ఫోన్ రావడంతో బోటును విడిచిపెట్టారని ఆరోపించారు. 


సోమవారమే బోటును కనుగొన్నారని కానీ దానిని బయటకు అసలు విషయం బయటకు పొక్కుతుందనే భయంతోనే నదిలో నుంచి బోటును బయటకు తీయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. లేకుంటే ఆ మాత్రం బరువున్న బోటును తీయడం పెద్ద కష్టమైన పని కాదని అన్నారు. ఇప్పటికైనా బోటును బయటకు తీసి శవాలను వారి బందువులకు అప్పగించాలని కోరారు. తన ఆరోపణలు తప్పనుకుంటే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా దేవీపట్నం ఎస్ఐతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. హర్షకుమార్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై జగన్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Related Post