రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌లో ఎదురుగాలి?

September 19, 2019


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీ నేతలు ఎప్పుడూ పదవులు, టికెట్ల కోసం కీచులాడుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కోసం, హుజూర్‌నగర్‌ టికెట్ కోసం ఆ పార్టీలో కీచులాటలు మొదలయ్యాయి. హుజూర్‌నగర్‌ టికెట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ఒక వర్గంగా ఏర్పడి రేవంత్‌ రెడ్డిపై కత్తులు దూస్తున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు వదిస్తుంటే, రేవంత్‌ రెడ్డి చామల కిరణ్ రెడ్డికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. హుజూర్‌నగర్‌ టికెట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు పలుకుతున్నందుకు ప్రతిగా ఆయన పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. అందుకే ఇప్పుడు మా మద్య ఎటువంటి విభేధాలు లేవని, తాను పిసిసి అధ్యక్ష పదవి చేపట్టడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహ పార్టీలో సీనియర్లు ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుకొంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌ రెడ్డి దశాబ్ధాలుగా పార్టీలో ఉన్న తమపై పెత్తనం చలాయిస్తే భరించబోమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగానే చెప్పారు. హుజూర్‌నగర్‌ నుంచి పద్మావతీ రెడ్డే పోటీ చేస్తారని, ఆమె తప్పకుండా గెలుస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రేవంత్‌ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్ పెరిగినప్పటికీ, ఇప్పుడు పార్టీలో సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా చేతులు కలపడం చూస్తే మళ్ళీ ఆ గ్రాఫ్ తలక్రిందులయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నవారిని కాదని తనకే పదవులు దక్కాలని, తను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి పట్టుబడితే ఆయనే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.


Related Post