పార్టీలో నా వెనుక కుట్ర: తెరాస ఎమ్మెల్యే

September 14, 2019


img

ఇటీవల నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ అయిన తెరాస భోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మళ్ళీ సంచలన ఆరోపణలు చేశారు. తెరాసలో నుంచి తనను బయటకు పంపించేందుకు పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారే తాను బిజెపిలో చేరబోతునట్లు పుకార్లు పుట్టించారని షకీల్ అహ్మద్ ఆరోపించారు. గతంలో తాను బిజెపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ధర్మపురి కుటుంబంతో తనకు మంచి పరిచయాలు, రాకపోకలు ఉండేవని అన్నారు. ఆ పరిచయంతోనే తాను ధర్మపురి అరవింద్‌ను కలిశాను తప్ప బిజెపిలో చేరాలనే ఉద్దేశ్యంతో కాదని అన్నారు. నేను ఎప్పటికీ తెరాసను విడిచిపెట్టి వెళ్ళనని, ఒకవేళ వెళ్ళవలసివస్తే పదవికి రాజీనామా చేసి ధైర్యంగా వెళతానని షకీల్ అహ్మద్ అన్నారు. 

పార్టీల పరంగా రాజకీయ నేతలు విభేధించుకొంటునప్పటికీ, కొందరు నేతలు పార్టీలకు అతీతంగా పరిచయాలు, స్నేహాలు కలిగి ఉంటారు. అయితే వర్తమాన రాజకీయాలలో అటువంటి పరిచయాలు, స్నేహాల వలన ఇటువంటి అపార్ధాలు కూడా ఏర్పడతాయని షకీల్ అహ్మద్-ధర్మపురి భేటీతో రుజువయింది. కనుక ఇప్పుడు తెరాస అధిష్టానం షకీల్ అహ్మద్‌ను అనుమానించడం సహజమే. కానీ ఈసమస్యను ఆయనే స్వయంగా సృష్టించుకున్నారు కనుక ఆయనే దీనిని పరిష్కరించుకోవలసి ఉంటుంది. ఇక ప్రతీపార్టీలో కుట్రలుకుతంత్రాలు సహజమే. తెరాస దానికి అతీతం కాదు. 


Related Post