కేటీఆర్‌ కూడా నల్లమలకు జై!

September 14, 2019


img

నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమంలో తెలంగాణ ఐ‌టి, పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్‌ కూడా చేరారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన దీనిపై సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు మొదలు వివిదరంగాలకు చెందిన ప్రముఖులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై స్పందిస్తూ, “ఈ అంశంపై మీ అభ్యంతరాలను చూశాను. వాటి గురించి నేను సిఎం కేసీఆర్‌ గారితో మాట్లాడుతానని మీకు హామీ ఇస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.

తద్వారా తెరాస సర్కార్‌ కూడా నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలపై పునరాలోచన చేయడానికి సిద్దంగా ఉందనే సంకేతాలు పంపారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించడంపై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆనందం వ్యక్తం చేస్తూ, “నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్‌, బిజెపి నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి దీంతో సమాదానం చెప్పినట్లయింది. తెరాస ప్రభుత్వం ఎప్పుడూ ప్రజాభీష్టం ప్రకారమే నడుచుకొంటుంది. నా నియోజకవర్గం ప్రజలు, ప్రముఖులు, ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్దపడటంతో ఈ ఆలోచన విరమించుకునేవరకు మేము కేంద్రప్రభుత్వంతో పోరాడుతాము,” అని అన్నారు. 


Related Post