సమ్మెకు సిద్దం అవుతున్న టిఎస్ ఆర్టీసీ

September 13, 2019


img

టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందజేశాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈనెల 25 తరువాత ఎప్పుడైనా నిరవదిక సమ్మెను ప్రారంభించాలనుకొంటున్నట్లు టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. 

ప్రధానంగా వారి డిమాండ్లు ఏమిటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలి. ప్రభుత్వోద్యోగులకు కల్పిస్తున్న ఉద్యోగభద్రత, ఇస్తున్న జీతభత్యాలు, సౌకర్యాలు ఇవ్వాలి. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను తక్షణం చెల్లించాలి. అదనపు డ్యూటీ చేస్తున్న డ్రైవర్, కండెక్టర్లకు అదనపు జీతం చెల్లించాలి. ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న డ్రైవర్లకు వేరేపని అప్పజెప్పాలి. విధి నిర్వహణలో ఎవరైనా కార్మికుడు చనిపోతే కనీసం రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఎటువంటి సీలింగ్ లేకుండా గ్రాట్యూటీ చెల్లించాలి. కాలుష్యం వెదజల్లుతున్న పాత బస్సుల స్థానంలో తక్షణం కొత్త బస్సులను ప్రవేశపెట్టాలి.  

ఈరోజు రాష్ట్రంలో పలు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు కాసేపు డిపోలవద్ద బైటాయించి నిరసనలు చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి తమ ఆందోళనలను ఉదృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈనెల 25వరకు ప్రతీరోజు వివిదరూపాలలో ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేస్తామని, 25 తరువాత ఎప్పుడైనా నిరవధిక సమ్మె మొదలుపెడతామని కార్మిక సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. 

రెండేళ్ళ క్రితం ఆర్టీసీ సంఘాలు సమ్మెకు సిద్దమైనప్పుడే సిఎం కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. “ఒకవేళ కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే ఆర్టీసీని మూసివేయవలసి వస్తుందని” హెచ్చరించారు. ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చిన ఇంక్రిమెంట్లతో సరిపెట్టుకొని ఆర్టీసీ సంఘాలు సమ్మె విరమించడంతో అప్పటికి సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయింది. కానీ మళ్ళీ ఇప్పుడు మొదటికొచ్చింది. ఈసారి సిఎం కేసీఆర్‌ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.  



Related Post