పదవులే తప్ప నిరుద్యోగుల కోసం ఆలోచించలేరా?

September 12, 2019


img

మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించి భంగపడినవారు మొదట ఆవేశంతో ఇప్పుడు ఆవేదనతో కన్నీరు కార్చుతూ మాట్లాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. పార్టీలో తమకు సముచిత స్థానం లభించలేదని బాధపడుతూనే, భవిష్యత్‌లో తప్పకుండా పదవులు లభిస్తాయని అందరూ సర్ధిచెప్పుకొంటున్నారు. ప్రభుత్వంలో ఇంకా వందలాది పదవులు భర్తీ చేయవలసి ఉందని కనుక మంత్రి పదవులు దక్కనివారు బాధపడవద్దని, వారికి తప్పకుండా తగిన పదవులు లభిస్తాయని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వారికి భరోసా ఇచ్చారు. 

మంత్రిపదవులు రానివారు బీపీలు పెంచుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఆనక మీడియా సమక్షంలో కన్నీళ్లు పెట్టుకోవడం, తెరాస అధిష్టానం వారికి తగిన పదవులిస్తామని భరోసా ఇస్తుండటం వంటి పరిణామాలను చూస్తున్న రాష్ట్రంలో నిరుద్యోగులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిపదవులు రాకపోతే కన్నీళ్ళు కార్చుతున్న తెరాస నేతలు, ఏనాడైనా రాష్ట్రంలో నిరుద్యోగుల దయనీయ పరిస్థితుల గురించి ఆలోచించారా... నిరుద్యోగ సమస్య గురించి ఏనాడైనా గట్టిగా మాట్లాడారా? అని ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణ ఏర్పడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన తెరాస, అధికారంలోకి వచ్చి సుమారు ఆరేళ్ళవుతున్నా కనీసం లక్ష ఉద్యోగాలైనా ఎందుకు భర్తీ చేయలేకపోయిందని నిరుద్యోగుల ప్రశ్నిస్తున్నారు. తెరాస మళ్ళీ అధికారంలోకి వస్తే నెలకు రూ.3,016 నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగాలు కల్పించలేకపోతే కనీసం ఆ నిరుద్యోగభృతి అయినా ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా నిరుద్యోగులున్నారని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పినప్పుడు వారికి ఏవిధంగా ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన చేయకుండా, మంత్రిపదవులు దక్కని రాజకీయ నిరుద్యోగులను సంతృప్తిపరిచేందుకు పదవులు పంచిపెట్టడానికి ఆలోచిస్తున్నారని నిరుద్యోగులు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రిపదవుల కోసం కన్నీళ్ళు కార్చుతున్న నేతలు నిరుద్యోగుల కోసం ఏనాడైనా ఒక్క చుక్క కన్నీరు కార్చారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడింది ప్రజల కోసమే కానీ పదవుల పంపకాల కోసం కాదని గ్రహించాలని నిరుద్యోగులు అంటున్నారు. కనీసం ఇకనైనా రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగుల గురించి కాస్త ఆలోచించి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి, తక్షణం రూ.3,016 నిరుద్యోగభృతి చెల్లింపులు ప్రారంభించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని, కన్నీళ్ళు కార్చుతున్న నేతలను కోరుతున్నారు. మరి వారి మొర ప్రభుత్వం ఆలకిస్తుందో లేదో?


Related Post