రాజయ్య మాటలకు అర్ధం ఏమిటో?

September 11, 2019


img

గత తెరాస ప్రభుత్వంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి పదవులు పొందిన తెరాస ఎమ్మెల్యే టి.రాజయ్య నెలల వ్యవదిలోనే అవినీతి ఆరోపణల కారణంగా ఒకేసారి అన్ని పదవులూ కోల్పోయారు. అయితే ఆయన జోరు ఏమాత్రం తగ్గలేదని, స్థానిక అధికారులు, తెరాస నేతలు, కార్యకర్తలతో చాలా దురుసుగా వ్యవహరించేవారని ఆరోపణలు వినిపించాయి. ఆ కారణంగా ఆయనకు 2018 అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ లభించకపోవచ్చునని అందరూ భావించారు. కానీ సిఎం కేసీఆర్‌ ఆయనకు మొదటి జాబితాలోనే స్టేషన్ ఘన్ పూర్ నుంచి టికెట్ కేటాయించడంతో అందరూ షాక్ అయ్యారు. రాజయ్య వివాదాస్పద వైఖరి కారణంగా స్థానిక తెరాస నేతలు, కార్యకర్తలు ఆయనకు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కడియం శ్రీహరికే అక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ రాజయ్య అదృష్టం కొద్దీ సిఎం కేసీఆర్‌ వారి ఒత్తిళ్ళకు ఏమాత్రం లొంగలేదు. అన్ని అంశాలను పరిగణించిన తరువాతే రాజయ్యకు టికెట్ కేటాయించానని కనుక ఆయనను మార్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో కడియంతో సహా తెరాస నేతలందరూ రాజయ్యకు మద్దతుగా ప్రచారం చేసి గెలిపించుకున్నారు. 

రాజయ్య గతంలో కీలక మంత్రి పదవులు చేపట్టినందున, ఈసారి కూడా మంత్రి పదవులు ఆశించడం సహజమే. కానీ ఇటీవల జరిగిన రెండవ మరియు తుది మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు అవకాశం కల్పించకపోవడంతో మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ, “రాష్ట్రంలో 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రతిపక్షాలు అడిగితే రాజకీయాలు చేస్తున్నారంటారు. మాదిగలకు న్యాయం చేయమని ఎవరో ఒకరు అడగాల్సిన సమయం వచ్చింది,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మళ్ళీ రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించిన రాజయ్య మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “నా మాటలను మీడియా తప్పుగా అర్ధం చేసుకొంది. మాదిగ జాతిపై సిఎం కేసీఆర్‌కు చాలా గౌరవం ఉంది కనుకనే మొదటిసారి అధికారంలోకి రాగానే మాదిగబిడ్డనైన నాకు కీలకపదవులు అప్పగించారు. ఇప్పుడు అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వలేకపోయినప్పటికీ భవిష్యత్‌లో తప్పకుండా మాదిగలకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తాను. వారు నాకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తాను,” అని అన్నారు. 

అంటే తనకు మంత్రిపదవి ఇస్తేనే మాదిగలకు న్యాయం చేసినట్లు, మంత్రి పదవి దక్కకపోతే రాజయ్యకు మాదిగల హక్కులు గుర్తొచ్చి మాట్లాడుతారని అర్ధమవుతోంది. మళ్ళీ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లోనైనా మంత్రిపదవి లభిస్తుందనే ఆశతో ‘మాదిగల హక్కుల ప్రస్తావన’ చేయబోరని కూడా అర్ధం అవుతోంది.

రాష్ట్రంలో వివిద కులాల ప్రజలు దయనీయమైన జీవితాలు గడుపుతుంటే, రాజయ్య వంటి నేతలు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం గట్టి ప్రయత్నాలు చేయకుండా తమకు మంత్రిపదవి ఇస్తే వారందరికీ న్యాయం జరిగినట్లేనని మాట్లాడుతుండటం చాలా శోచనీయం.


Related Post