ఏపీలో ఏం జరుగుతోంది?

September 11, 2019


img

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్థితి చూస్తున్నవారెవరికైనా మనసు చివుక్కుమనిపించకమానదు. చంద్రబాబు హయాంలో కాస్త అభివృద్ధి జరిగినట్లు కనిపించినప్పటికీ, రాజధాని, పోలవరం నిర్మాణపనులు పూర్తిచేయలేకపోవడం, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను రప్పించలేకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరగడం వంటి అనేకానేక కారణాలతో ‘ఒక్కసారి జగనన్నకు అవకాశం ఇచ్చి చూద్దాం...”అనుకున్నారు ఏపీ ప్రజలు. 

ప్రజల ఆకాంక్షల మేరకు మొదట్లో సానుకూల నిర్ణయాలతో దూసుకుపోయిన ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, కోట్లు రూపాయలు వెచ్చించి బాబు ప్రభుత్వం అమరావతిలో నిర్మించిన ‘ప్రజావేదిక’ను కూల్చివేయడంతో రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత పోలవరం నిర్మాణ పనులు నిలివేసి రివర్స్ టెండరింగ్ చేపట్టడంతో నిర్మాణ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దాంతో కొత్త ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. కానీ నేటికీ పోలవరాన్ని ప్రభుత్వం ఏవిధంగా పూర్తి చేయాలనుకొంటోందో తెలియడంలేదు.  

ఆ తరువాత విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష చేయాలనుకున్నప్పుడు కేంద్రప్రభుత్వం గట్టిగా వారించింది. ఆ వివాదం ఇంకా అలాగే ఉంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణపనులు నిలిపివేయడంతో అక్కడ పనిచేస్తున్న వేలాదిమంది భవననిర్మాణ కార్మికులు పనిలేక వెనుతిరిగి వెళ్లిపోవడంతో రాజధాని ప్రాంతం బోసిపోయింది. అదే సమయంలో రాజధానిని వేరే చోటికి తరలించబోతున్నట్లు మంత్రి బొత్స మాట్లాడటంతో ప్రజలలో తీవ్ర అసంతృప్తి, అసహనం, గందరగోళం మొదలయ్యాయి. 

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమలుచేయడం కోసం ఇసుక సరఫరాను నిలిపివేయడంతో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడింది.  దాంతో వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. తాజాగా టిడిపి, వైసీపీ బాధితుల శిబిరాలు, ఆందోళనలు, చంద్రబాబుతో సహా టిడిపి నేతల హౌస్ అరెస్టులతో రాష్ట్రం అట్టుడుకుతోంది. 

ఇక రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చూస్తే జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న తాజా నిర్ణయాలతో మరింత దయనీయంగా మారింది.  నెలకు రూ.5,000 జీతంతో ఒకేసారి 4 లక్షల గ్రామ వాలంటీర్ల నియామకాలు, కొత్తగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాటిలో పదిమంది చొప్పున కొత్త ఉద్యోగుల నియామకాలు, పింఛన్ల పెంపు, నవరత్నాలలో భాగంగా సిఎం జగన్ వివిద వర్గాలకు ప్రకటిస్తున్న నజరానాలతో ఇప్పటికే ఆర్ధికంగా చితికిపోయున్న ప్రభుత్వంపై భారీగా ఆర్ధికభారం పడింది. 

ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టాక మునుపు రాష్ట్రంలో పాదయాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల సమస్యలను స్వయంగా చూసి తెలుసుకున్నారు. రాష్ట్రం పరిస్థితి ఏవిధంగా ఉందో స్వయంగా చూశారు. కనుక ఆయన ముఖ్యమంత్రి కాగానే మొదట ప్రభుత్వంపై పట్టు సాధించి, పాలనపై దృష్టి సారించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేసి తద్వారా ఆర్ధిక స్థిరత్వం సాధిస్తారని అందరూ ఆశించారు. కానీ సిఎం జగన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండటంతో, టిడిపి నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల సానుభూతి పొందేందుకు చక్కటి అవకాశాలు కల్పిస్తున్నట్లవుతోంది. కేవలం 100 రోజులలోనే ప్రజలలో ప్రభుత్వం పట్ల అపనమ్మకం, అసహనం ఏర్పడ్డాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అక్కడ కేవలం రాజకీయాలు, కులాల కుమ్ములాటలు తప్ప ఎక్కడా అభివృద్ధి అనే మాట వినిపించడం లేదు...కనిపించదు. గత ఐదేళ్ళ నుంచి నేటి వరకు జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తుంటే ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారుతుందో లేదో? ఎప్పటికైనా రాష్ట్రం మళ్ళీ గాడిన పడుతుందో లేదో? అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజల దురదృష్టం, దౌర్భాగ్యం అనుకోవాలా లేక పాలకుల అసమర్దత అనుకోవాలో తెలియదు. 


Related Post