ఆ రెండూ ఒక్కటే...ఇదిగో సాక్ష్యం: రేవంత్‌

September 11, 2019


img

తెరాస-బిజెపిలు పైకి శత్రువులులాగ యుద్ధాలు చేస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన కొనసాగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర బిజెపి నేతలు కాళేశ్వరం, మిషన్ భగీరధ, కాకతీయ ప్రాజెక్టులలో అవినీతి జరుగుతోందని విమర్శలు గుప్పిస్తుంటే, రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్‌ తెరాస సర్కార్‌ అద్భుతంగా పనిచేస్తోందని, రాష్ట్రంలో ప్రాజెక్టులు దేశానికే ఆదర్శమంటూ పొగిడారని అన్నారు. తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని తమిళిసై మాటలతో రుజువైందన్నారు రేవంత్‌ రెడ్డి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెరాస సర్కార్‌ను పొగడటంపై రాష్ట్ర బిజెపి నేతలు స్పంచాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 

తమిళనాడు బిజెపి అధ్యక్షురాలుగా చేసి వచ్చిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తెరాస సర్కార్‌పై ప్రశంశలు కురిపించడం రాష్ట్ర బిజెపి నేతలకు ఇబ్బందికరంగా మారవచ్చునని ముందే ఊహించడం జరిగింది. ఊహించినట్లుగానే కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి రాష్ట్ర బిజెపి నేతలను నిలదీశారు. ఈసారి వారు తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తే, అప్పుడు తెరాస నేతలు కూడా మా ప్రభుత్వ పనితీరును, ప్రాజెక్టులను (మీ) గవర్నర్‌ ప్రశంసిస్తుంటే, మీరు విమర్శిస్తున్నారేమిటని ఎదురు ప్రశ్నించవచ్చు. కనుక రాష్ట్ర బిజెపి నేతలకు ఎదురైన ఈ కొత్త సమస్యను ఏవిదంగా పరిష్కరించుకుంటారో చూడాలి.


Related Post