తెరాసపై కేసీఆర్‌ పట్టుకోల్పోయారు: మల్లు రవి

September 10, 2019


img

గతంలో ఎన్నడూ లేనివిధంగా సిఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలకు సాఫ్ట్‌-టార్గెట్‌గా మారడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. యాదాద్రి ఆలయంలో కేసీఆర్‌ బొమ్మలను చెక్కడంపై ప్రతిపక్షాలు సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ తెరాస నేతలెవరూ జవాబు చెప్పలేని దుస్థితి ఏర్పడింది. 

అలాగే మంత్రి ఈటల రాజేందర్‌ ‘గులాబీ ఓనర్లం మేమే...మంత్రిపదవి ఎవరో పెట్టిన బిక్షకాదు...”అంటూ సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి పరోక్షంగా ఘాటుగా మాట్లాడినప్పటికీ తెరాస నేతలు ఎవరూ ఖండించలేకపోయారు. మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి వంటివారు సిఎం కేసీఆర్‌ తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా పార్టీలో ఎవరూ స్పందించలేదు. 

ఇక సిఎం కేసీఆర్‌ స్వయంగా రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై గతంలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్‌, బిజెపిలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను సిఎం కేసీఆర్‌ దివాళా తీయిస్తున్నారని గతంలో తాము చేసిన వాదనలు ఇప్పుడు నిజమని బడ్జెట్‌ నిరూపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ చితికిపోయిందని, కానీ కేసీఆర్‌ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 

ఫిబ్రవరిలో ఓట్-ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు సిఎం కేసీఆర్‌ నోట ఆర్ధికమాంద్యం ప్రస్తావన రాలేదని, ఆ తరువాత చింతమడక గ్రామంలో ప్రతీ ఇంటికీ రూ.10 లక్షలు ఆర్దికసాయం ఇస్తామని ప్రకటించారని, కానీ ఇప్పుడు హటాత్తుగా ఆర్ధికమాంద్యం కారణంగా రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ కేసీఆర్‌ మాయమాటలు చెపుతున్నారని కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాల కారణంగానే నేడు ఇటువంటి దుస్థితి ఎదురైంది తప్ప కేంద్రం సాయం అందించకపోవడం వలననో, ఆర్ధికమాంద్యం వలననో కాదని కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.

సీనియర్ కాంగ్రెస్‌ నేత మల్లు రవి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్ధికంగా 20 ఏళ్ళు వెనక్కు వెళ్లిపోయింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని దుస్థితి ఏర్పడింది. దాంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చింతమడకలో ప్రతీ ఇంటికీ రూ.10 లక్షలు ఆర్దికసాయం ఇస్తామని ప్రకటించినప్పుడు గుర్తుకురాని ఆర్ధికమాంద్యం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? సిఎం కేసీఆర్‌ తన తప్పులకు కేంద్రాన్ని నిందించి తప్పించుకోవాలనుకొంటున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టుకోల్పోవడంతో పదవుల పంపిణీ, మంత్రివర్గ విస్తరణకు సిద్దమయ్యారు. ఆయన ప్రభుత్వాన్ని బయటవారు ఏమీ చేయనక్కరలేదు. పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారే ఏదోరోజు పడగొడతారు,” అని అన్నారు. కాంగ్రెస్‌-బిజెపి చేస్తున్న ఈ విమర్శలకు తెరాస ఎప్పుడు, ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. బహుశః మున్సిపల్ ఎన్నికలలో గెలిచి సమాధానం చెపుతుందేమో?


Related Post