ఫిరాయింపుల పునాదులపై పార్టీలను నిర్మించుకుంటే...

September 10, 2019


img

తెలంగాణలో తెరాస రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, టిడిపిల నేతలను, ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసుకున్నారు. దానికి ‘బంగారి తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ’ అనే అందమైన పేరు పెట్టుకున్నారు. అది అప్రస్తుతం. 

కాంగ్రెస్‌, టిడిపిల చేరికలతో తెరాస బలపడి సిఎం కేసీఆర్‌ ఆశించినట్లుగానే రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా నిలిచింది. ఒక్క లోక్‌సభ ఎన్నికలలో తప్ప గత ఐదున్నరేళ్ళలో జరిగిన ప్రతీ ఎన్నికలలో తెరాస వరుస విజయాలు సాధిస్తూనే ఉంది. దాంతో ‘నా మాటే శాసనం...’అనే స్థాయిలో సిఎం కేసీఆర్‌ పాలన సాగించగలుగుతున్నారు. 

అయితే పార్టీ రాజకీయంగా బలపడటం దేనికి?అని ఆలోచిస్తే అధికారం నిలుపుకోవడం కోసమేనని అర్ధం అవుతుంది. అధికారకాంక్ష లేకుండా ప్రభుత్వ పనితీరుతోనే ప్రజలను మెప్పించగలమనే నమ్మకం ఉన్నట్లయితే ఈ ఫిరాయింపులు అవసరమే ఉండదు. కానీ అధికార కాంక్ష, దానిని నిలుపుకోవాలనే తాపత్రయం ఉన్నాయి కనుకనే ఈ ఫిరాయింపుల  సంస్కృతి మొదలైంది. 

అయితే తెలంగాణ ఉద్యమాలలో తనతో భుజంభుజం కలిపి పోరాడినవారితోనే తెరాసను బలోపేతం చేసుకోలేమా? అని కేసీఆర్‌ ఆలోచించి ఉండి ఉంటే నేడు పార్టీ పరిస్థితి మరోవిధంగా ఉండేదేమో? నిబద్దత కలిగిన ఉద్యమకారులతో పార్టీని బలోపేతం చేసుకొని కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలకు ధీటుగా ఎదిగేందుకు కొంత ఎక్కువ సమయం పట్టి ఉండేదేమో కానీ ఖచ్చితంగా తెరాస ఇప్పటికంటే ఇంకా బలమైన పునాదులు ఏర్పడి ఉండేవి.  

కానీ ఎన్నికలలో గెలిచేందుకు, అధికారాన్ని కాపాడుకునేందుకు అవకాశవాదులైన రాజకీయనాయకులను చేరదీశారు. వారికి మంత్రిపదవులు ఇస్తే తప్ప పార్టీలో చేరరు...పదవులు ఈయకపోతే పార్టీలో ఉండరనే ఏకైక కారణంతో వారికి మంత్రి పదవులు ఈయక తప్పడంలేదు. కనుక తెరాసలో ఉద్యమసమయం నుంచి పనిచేసిన వారిని పక్కనపెట్టక తప్పడం లేదు. దీంతో సహజంగానే తెరాస నేతలకు ఆగ్రహం, అసంతృప్తి కలుగుతోంది. 

ప్రస్తుతం తెరాసలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నాయిని, కడియం, కర్నే, పల్లా, రసమయి, పద్మాదేవేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జోగురామన్న వంటి అనేకమంది సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం క్యూలో ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాసలో చేరిన సబితా ఇంద్రారెడ్డివంటివారికి మంత్రి పదవి కట్టబెట్టడంతో వారందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ప్రతీసారి బయటనుంచి వచ్చినవారికి మంత్రిపదవులు కట్టబెట్టడం, వాటికోసం ఎదురుచూస్తున్న పార్టీలో సీనియర్ నేతలను బుజ్జగించడం పరిపాటిగా మారడంతో పార్టీ పునాదులు బలహీనపడుతున్నాయి. ఈటల రాజేందర్‌, రసమయి, నాయిని, తాడికొండ రాజయ్య వ్యాఖ్యలు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి అద్ధం పడుతున్నాయి. 

పార్టీలో సీనియర్ నేతలే కాక మంత్రిపదవుల హామీతో పార్టీలో చేరిన దానం నాగేందర్ వంటి నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇల్లలకాగానే పండగ కాదన్నట్లు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే అధికారం సాధించవచ్చు..నిలబెట్టుకోవచ్చు కానీ ఇటువంటి తలనొప్పులు తప్పవని అర్ధమవుతోంది. 


Related Post