గవర్నర్‌ ప్రసంగం..రాష్ట్ర బిజెపి నేతలకు ఇబ్బంది

September 10, 2019


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం దూరదర్శన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో గవర్నరైనా రాష్ట్ర ప్రభుత్వం పనితీరును, ప్రభుత్వ పధకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూనే మాట్లాడుతుంటారు. కనుక ఆమె కూడా సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అద్భుతంగా ప్రగతి సాధిస్తోందని ప్రశంసల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి (కేసీఆర్‌) సంకల్పబలంతో నిర్మితమైన మహాద్భుతం. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, రైతుబందు వంటి మంచి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది,” అని అన్నారు. 

తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంతో రాష్ట్ర బిజెపి నేతలు ఇబ్బందిపడటానికి బలమైన కారణమే ఉంది. ఆమె గవర్నర్‌ పదవి చేపట్టక మునుపు తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండేవారు. తెలంగాణలో బిజెపి బలంగానే ఉన్నప్పటికీ రాష్ట్ర బిజెపి నేతలు 12 లక్షలకు మించి సభ్యత్వాలు చేయలేకపోయారు. కానీ తమిళనాడులో అసలు ఉనికేలేని బిజెపికి ఆమె 44 లక్షల సభ్యత్వాలు చేయించారు. కనుక తెలంగాణలో కూడా బిజెపి బలపడేందుకు ఆమె సహకరిస్తారని బిజెపి నేతలు ఆశించడం సహజం. కానీ ఆమె తాము పోరాడుతున్న సిఎం కేసీఆర్‌ను పొగడటం, తాము అవినీతి విమర్శలు, ఆరోపణలు చేస్తున్న ప్రాజెక్టులను దేశానికే ఆదర్శమని అభివర్ణించడం రాష్ట్ర బిజెపి నేతలు జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ అంశంతో కెసిఆర్ సర్కారుతో యుద్ధం చేస్తున్న రాష్ట్ర బిజెపి నేతలకు గవర్నర్ ప్రసంగాన్ని చూపి తెరాస నేతలు ఎదురు ప్రశ్నిస్తే బిజెపి నేతల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.   

ప్రస్తుతం ఆమె గవర్నర్‌ కనుక రాజకీయాలు చేయలేరు కానీ బిజెపి నుంచి వచ్చిన ఆమె బిజెపికి నష్టం లేదా ఇబ్బంది కలిగించేవిధంగా వ్యవహరిస్తారనుకోలేరు. కనుక ఆమె తీరుతో రాష్ట్ర బిజెపి నేతలకు మొదటి జలక్ తగిలిందనే చెప్పవచ్చు. అయితే తొలి ప్రసంగంలోనే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదనే భావనతో ఆమె ఆవిధంగా మాట్లాడారా లేక ఇకముందు కూడా ఆమె ఇదేవిధంగా కేసీఆర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారా? అనేది చూడాలి. 

ఒకవేళ ఆమె కూడా గవర్నర్‌ నరసింహన్‌లాగ సిఎం కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే రాష్ట్ర బిజెపి నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగే అవుతుందని చెప్పవచ్చు. అప్పుడు ఆమెను విమర్శించక తప్పదు కానీ ఆమె బిజెపి నుంచి వచ్చినందున విమర్శించలేరు. రాష్ట్ర బిజెపి నేతలకు ఇదో కొత్త సమస్య.


Related Post