హరీశ్‌కు ఆర్ధికశాఖ వరమా శాపమా?

September 09, 2019


img

గత ప్రభుత్వంలో సాగునీటిశాఖను అద్భుతంగా నిర్వహించి అందరి ప్రశంసలు సొంతం చేసుకున్న హరీశ్‌ రావుకు రెండోసారి తెరాస అధికారంలోకి రాగానే సిఎం కేసీఆర్‌ ఆయనకు మళ్ళీ అదే పదవి ఇచ్చి మిగిలిన ప్రాజెక్టులను అదే వేగంతో పూర్తి చేయిస్తారని అందరూ భావించారు. కానీ ఆయనను పూర్తిగా పక్కనపెట్టేసి టిడిపి నుంచి వచ్చి మంత్రిపదవి దక్కించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. గతంలో సిఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టుల పర్యటనకు వెళ్ళినప్పుడు పక్కన తప్పకుండా హరీశ్‌ రావు ఉండేవారు. కానీ ఇప్పుడు ఎర్రబెల్లి కనిపిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. బహుశః అందుకే తెరాసలో ఈటల రాజేందర్‌, నాయిని, రసమయి, రాజయ్య వంటి సీనియర్లు ‘ప్యారాచూట్ మంత్రులు’ పట్ల ఏదో రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని భావించవచ్చు. మాజీ మంత్రి నాయిని వారిని కిరాయిదారులతో పోల్చి ఎంతకాలం ఉంటారో? అని అసంతృప్తి వ్యక్తం చేయడం అందుకు తాజా ఉదాహరణ. 

ఇక హరీశ్‌ రావు విషయానికి వస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నేతలే కాదు సామాన్య ప్రజలు సైతం కోరుకొంటున్నారు. కానీ సిఎం కేసీఆర్‌ ఎందుకో ఆయనను చాలా కాలం పక్కన పెట్టి ఇప్పుడు హటాత్తుగా కీలకమైన ఆర్ధికశాఖను ఆయనకు కట్టబెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయినందున, పార్టీలో అసంతృప్తి జ్వాలలు మొదలైనందునే హరీశ్‌ రావుకు మంత్రి పదవి ఇచ్చారని లేకుంటే లభించేదే కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులలో హరీశ్‌ రావుకు ఆర్ధికశాఖను కట్టబెట్టడం ఆయనకు వరమా లేక శాపమా? అనే చర్చ మొదలైంది.

ఎందుకంటే, సిఎం కేసీఆర్‌ స్వయంగా ఆర్ధిక పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికమాంద్యం కారణంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని అన్నారు. ఆర్ధిక పరిస్థితి బలంగా ఉన్నప్పుడు ఆర్ధికమంత్రి పదవికి చాలా పోటీ, విలువ ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆర్ధికశాఖ అంటే మెడపై కత్తిపెట్టినట్లే అవుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పధకాల అమలుకే రూ.37,863 కోట్లు కావాలి. మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి భారీగా నిధులు కావాలి. ఆ ప్రాజెక్టులకు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ బిల్లుల చెల్లింపులకు, భారీగా నిధులు అవసరం ఉంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, పంటరుణాలమాఫీ, నిరుద్యోగ భృతి వంటి పెండింగ్ హామీలు ఉండనే ఉన్నాయి. ఇక ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, సంక్షేమ హాస్టల్స్ వంటి రాబడిలేని సామాజిక బాధ్యతలు ఉండనే ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితులు ఏవిధంగా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేకులు వేయడానికి వీలులేదు.

ఇక ‘చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు వంటి వరాలకు, గుళ్ళు గోపురాల అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో కోతలు పెట్టడానికి వీలులేదు. అలాగే సిఎం కేసీఆర్‌ డ్రీమ్ ప్రాజెక్టులు కొత్త సచివాలయం, అసెంబ్లీ, వీలైతే కొత్త హైకోర్టు భవనాల నిర్మాణాలకు వందల కోట్లు సిద్దం చేసి అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో హరీశ్‌ రావు ఆర్ధికశాఖను ఏవిధంగా బలోపేతం చేయగలరు? చేయలేకపోతే ఆ అప్రదిష్ట ఆయనకే చుట్టుకొంటుంది కదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ‘ట్రబుల్ షూటర్’గా పేరున్న హరీశ్‌ రావు ఆర్ధికశాఖను బలోపేతం చేయగలిగితే ఆయనకు ఇంకా మంచిపేరు వస్తుంది. కానీ అందుకు ఆయన ముందుగా ప్రభుత్వాన్ని ఆర్ధిక క్రమశిక్షణలో పెట్టాల్సి ఉంటుంది. కానీ సిఎం కేసీఆర్‌ కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వాన్ని ఆయన శాసించగలరా?అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు.


Related Post