తెరాసకు మరో ఓనర్...నాయిని

September 09, 2019


img

తెరాసలో మంత్రి పదవులు ఆశించి భంగపడినవారు ఊహించినట్లుగానే అసంతృప్తిరాగాలు మొదలుపెట్టారు. మొట్టమొదటగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రాగాలాపన మొదలుపెట్టారు. 

సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాకు మంత్రిపదవి ఇస్తానని సిఎం కేసీఆర్‌ మాట తప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో నేను పోటీ చేస్తానంటే ఎమ్మెల్సీగా ఉంటే మంత్రిపదవి ఇస్తానన్నారు. నా అల్లుడుకి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానన్నారు. ఇప్పుడు నాకు మంత్రికి బదులు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకుంటున్నారని పేపర్లలో చూశాను. నష్టాలలో మునిగి ఉన్న ఆర్టీసీలో సారం లేదు. నాకా పదవి అవసరం లేదు. సిఎం కేసీఆర్‌ తెరాస ఇంటిపెద్ద. మేమందరం కూడా ఓనర్లమే. మా ఇంట్లో కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో వాళ్ళిష్టం,” అని అన్నారు. 

తెరాస ఇంట్లో కిరాయిదార్లు అంటే కాంగ్రెస్‌, టిడిపిల నుంచి మంత్రిపదవులు పొందిన ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి వంటివారని వేరే చెప్పనవసరం లేదు. సిఎం కేసీఆర్‌ కిరాయిదార్లకు మంత్రిపదవులిచ్చి పార్టీలో సీనియర్ల(ఓనర్లు)ను పక్కను పెట్టారని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓనర్ల జాబితాలో మంత్రిపదవులు ఆశించి భంగపడినవారు బహుశః ఇక నుంచి కోరస్‌గా అసంతృప్తిరాగాలు తీయవచ్చు. 


Related Post