బడ్జెట్‌లో ఏముందో హరీశ్‌కు తెలుసా? కాంగ్రెస్‌ ప్రశ్న

September 09, 2019


img

సిఎం కేసీఆర్‌ హరీశ్‌ రావుకు కీలకమైన ఆర్ధికమంత్రిత్వ శాఖను అప్పగించడంపై ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ 2019-20 సం.లకి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను తయారుచేయించిన తరువాత హరీశ్‌ రావును ఆర్ధికమంత్రిగా నియమించడం, దానిలో ఏముందో కనీసం తెలుసుకోకుండానే ఆయన చేత ఈరోజు శాసనమండలిలో ప్రవేశపెడుతుండటాన్ని మహిళా కాంగ్రెస్‌అధ్యక్షురాలు ఇందిరా శోభ ఆక్షేపించారు.

తెరాసలో అంతర్గతంగా పెరిగిన ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకే సిఎం కేసీఆర్‌ హరీశ్‌ రావును మంత్రివర్గంలో తీసుకున్నారు తప్ప ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదనడానికి ఇది ఒక ఉదాహరణ అని శోభ అభిప్రాయం వ్యక్తం చేశారు. హరీశ్‌ రావు ఒక్కరే కాదు...చాలామంది మంత్రులకు తమ శాఖలకు సంబందించి స్వంతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు, అధికారాలు లేవని శోభ అన్నారు.

సిఎం కేసీఆర్‌ ముందుగా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని నెలరోజులు ముందుగానే మంత్రివర్గ సమావేశంలో వారితో అన్ని విషయాలు చర్చించి, వారి అభిప్రాయాలు విని, వారి సలహాలు, సూచనలు తీసుకొని ఉండి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ మంత్రుల ప్రమేయం లేకుండా సిఎం కేసీఆర్‌ ఒక్కరే అన్ని శాఖలకు సంబందించి నిర్ణయాలు తీసుకొని, నిన్న రాత్రి హడావుడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి మంత్రులచేత రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయించుకోవడం సరికాదని శోభ అన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను సిఎం కేసీఆర్‌ ఎలాగూ పట్టించుకోరు కనీసం తన మంత్రుల సలహాలనైనా పట్టించుకుంటే బాగుంటుందని శోభ ఎద్దేవా చేశారు.

తెలంగాణకు మహిళా గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్‌ వచ్చినందునే సిఎం కేసీఆర్‌ ఇద్దరు మహిళా మంత్రులను తన కేబినెట్‌లోకి తీసుకున్నారని లేకుంటే తీసుకొని ఉండేవారు కారేమోనని శోభ అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ కనీసం ఇప్పటికైనా మహిళలకు మంత్రిపదవులిచ్చి గౌరవించినందుకు సంతోషమని శోభ అన్నారు.


Related Post