కేసీఆర్‌కు తెలియకుండా అది జరిగిందా?

September 07, 2019


img

యాదాద్రి ఆలయంలో సిఎం కేసీఆర్‌, కారు, ప్రభుత్వ సంక్షేమ పధకాల బొమ్మలు చెక్కడంపై రాజుకున్న వివాదం అందరూ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌, బిజెపి నేతలకు ఇదొక మంచి ఆయుధంగా లభించడంతో మూకుమ్మడిగా కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే సహించని తెరాస నేతలు, మంత్రులు ప్రతిపక్షాలు ఏకంగా తమ అధినేత కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ మౌనం వహించవలసి రావడం గమనిస్తే, దీని వలన తెరాస ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందో అర్ధం చేసుకోవచ్చు. 

యాదాద్రి నిర్మాణ పనులను కేసీఆర్‌ స్వయంగా పరిశీలిస్తున్నారు కనుక ఈ బొమ్మల వ్యవహారం ఆయనకు తెలియదనుకోలేము. హిందూధర్మం, సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావాలు గల సిఎం కేసీఆర్‌కు ఈవిధంగా చేయడం అపచారమని తెలియదనుకోలేము. అలాగే దీనివలన ప్రతిపక్షాలకు తనను విమర్శించేందుకు అవకాశం లభిస్తుందనే విషయం ఆయనకు తెలియదనుకోలేము. అయినా స్తంభాలపై తన బొమ్మలు చెక్కడానికి అంగీకరించారంటే, రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ వ్యక్తిగత ప్రచారాన్ని కోరుకొంటున్నారనే భావించాల్సి ఉంటుంది. 

తెలుగు ప్రజలకు, ముఖ్యంగా...తెలంగాణ ప్రజలకు యాదాద్రి(గుట్ట)తో విడదీయలేని అనుబందం ఉంది. కనుక ఈ చర్యను వారు సైతం జీర్ణించుకోవడం కష్టమే. ప్రజలలో చాలా సులువుగా సెంటిమెంటు రగించగల నేర్పు ఉన్న సిఎం కేసీఆర్‌, ఈ చర్య వలన ప్రజల సెంటిమెంటును దెబ్బతీసినట్లవుతుందని, హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయని గుర్తించలేకపోయారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 

దీనిపై బిజెపి నేతలు పోరాడుతున్న తీరు చూస్తుంటే, వారు ఈ అంశాన్ని మున్సిపల్ ఎన్నికలలో ఆయుధంగా మలుచుకొని తెరాసపై ప్రయోగించే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఈ వివాదాన్ని తెరాస సర్కార్‌ ఎంత త్వరగా ముగించగలిగితే అంతా దానికే మంచిది. పంతానికి పోయి మూల్యం చెల్లించడం కంటే కాస్త వెనక్కు తగ్గి ఈ సమస్య నుంచి బయటపడటమే తెరాసకు అన్ని విదాలా మంచిది. 


Related Post