తెలంగాణ టిడిపి పతనానికి ఎవరు కారకులు?

September 07, 2019


img

ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కూడా బలీయమైన శక్తిగా నిలిచిన టిడిపి, రాష్ట్ర విభజన అనంతరం ఫిరాయింపుల కారణంగా 5 ఏళ్ళలోనే దాదాపు పతనావస్థకు చేరుకుంది. కనుక రాష్ట్రంలో టిడిపి పతనానికి సిఎం కేసీఆర్‌ కారకులని అందరికీ తెలుసు. కానీ మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరంటే, టిడిపి అధినేత చంద్రబాబునాయుడే.  

ఆ సమయంలో ఆయన ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టడం వలన కావచ్చు లేదా ఓటుకు నోటు కేసు కారణంగా గతంలో మాదిరిగా తెలంగాణలో స్వేచ్ఛగా తిరగలేకపోవడం వల్ల కావచ్చు లేదా ఆ కేసు కారణంగా రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట మసకబారి ప్రజల నిరాధారణకు గురికావడం వలన కావచ్చు...కారణాలు ఏవైతేనేమీ టిడిపి అధినేతే టిటిడిపి పతనానికి కారకులయ్యారని చెప్పక తప్పదు. 

ఈ వాదనతో టిడిపి నేతలు అంగీకరించకపోవచ్చు కానీ తెలంగాణలో ఎంతో బలంగా ఉన్న టిడిపి క్రమంగా కనుమరుగవుతోందని తెలిసినా, టిటిడిపి నేతల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని తెలిసినా చంద్రబాబునాయుడు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ నేతలు వరుసగా తెరాసలోకి వెళ్ళిపోతుంటే ఆ పార్టీ అధిష్టానం ఏవిధంగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందో, చంద్రబాబునాయుడు కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆవిధంగా చూస్తూ ఉండగానే రాష్ట్రంలో పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. 

ఇంతకంటే విచారకరమైన విషయమేమిటంటే, టిడిపి నేతలను చంద్రబాబునాయుడే స్వయంగా కాంగ్రెస్‌, బిజెపిలోకి సాగనంపుతుండటం. ఈ విమర్శలను కూడా టిడిపి నేతలు ఖండిస్తున్నప్పటికీ, ఇటీవల బిజెపిలో చేరిన ఆ పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి శుక్రవారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను చంద్రబాబునాయుడు, టిడిపిపై కోపంతోనో...ద్వేషంతోనే బిజెపిలో చేరలేదు. రాష్ట్రంలో టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదా...లేక వేరే పార్టీలో చేరడం మంచిదా?అని ఆలోచించి, దీనిపై చంద్రబాబునాయుడుతో సుదీర్ఘంగా చర్చించిన తరువాతే బిజెపిలో చేరాను. రాష్ట్రంలో తెరాసను డ్డీకొని ఎదురునిలవగల శక్తి బిజెపికి మాత్రమే ఉందని భావించి దానిలో చేరాను,” అని చెప్పారు. 

అంటే చంద్రబాబునాయుడు సూచన మేరకే తాను బిజెపిలో చేరానని రేవూరి చెప్పకనే చెప్పుతున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడే తన పార్టీ నేతలను వేరే పార్టీలో చేరేందుకు అవసరమైన మార్గదర్శనం చేయడం బహుశః ఎన్నడూ ఎవరూ చూసి ఉండరేమో? కనుక తెలంగాణలో టిడిపి గురించి ఇంక రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించనవసరం లేదనే చెప్పవచ్చు.


Related Post