ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్: ప్రధాని మోడీ

September 07, 2019


img

ఒక అపజయం లేదా ఎదురుదెబ్బ మన విజయానికి సోపానంగా మారాలి తప్ప వాటిని చూసి క్రుంగిపోకూడదనే సిద్దాంతంతో పనిచేస్తుంటారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేయడంలో విఫలమవడంతో, అంతవరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ మిషన్‌లో అన్ని అంచెలు విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు ఒక్కసారిగా తీవ్రవిషాదంలో మునిగిపోయారు. ఈ చివరిదశ కీలక ప్రయోగాన్ని స్వయంగా వీక్షించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, కన్నీరు పెట్టుకొంటున్న ఇస్రో ఛైర్మన్ శివన్‌ను కౌగలించుకొని భుజం తడుతూ ఓదార్చారు. అది చూసి ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు.

అనంతరం ప్రధాని నరేంద్రమోడీ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీరందరూ మీ సుఖసంతోషాలను త్యాగం చేసి, కుటుంబాలను పట్టించుకోకుండా రేయింబవళ్లు దీని కోసం పనిచేశారు. ఈ మిషన్ పట్ల మీ నిబద్దతకు జోహార్లు. యావత్ దేశప్రజల తరపున మీకు సెల్యూట్ చేస్తున్నాను. మీ వెనుక నేను, ప్రభుత్వం, యావత్ దేశప్రజలం ఉన్నామని మరిచిపోవద్దు. దీనిని అపజయంగా భావించడం సరికాదు. మొట్టమొదటి ప్రయత్నంలోనే మనం చంద్రుడికి చాలా దగ్గరగా వెళ్లాము. ఈ ప్రయోగంతో మీ మేధస్సు, శక్తిసామర్ధ్యాలు లోకానికి తెలిసివచ్చాయి. కనుక మనం ఇక వెనకడుగు వేయవలసిన అవసరమే లేదు. అపజయం నుంచి పాఠాలు నేర్చుకొంటూ ముందుకు సాగిపోవాలి. మీరు భవిష్యత్తులో చాలా గొప్ప విజయాలు సాధించి భారతదేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేస్తారనే నమ్మకం నాకుంది. కనుక మీరు మీ ప్రయోగాలను కొనసాగించాలని కోరుతున్నాను. భవిష్యత్తులో మీరు సాధించబోయే విజయాన్ని చూడాలని నాతో సహా యావత్ దేశ ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటాము,” అని అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ ఇస్రో శాస్త్రవేత్తలను ఇంతగా వెన్ను తట్టి ప్రోత్సహించినందుకు దేశవిదేశాలలోని భారతీయులు హర్షిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు రానున్న రోజులలో తప్పకుండా భారత్‌ గర్వపడేవిదంగా చేస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


Related Post