కేసీఆర్‌ దేవుడు..అందుకే ఆయన బొమ్మ చెక్కాను: శిల్పి

September 07, 2019


img

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి మండపంలో స్తంభాలపై సిఎం కేసీఆర్‌, కారు గుర్తు, సంక్షేమ పధకాల బొమ్మలను చెక్కడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో తెరాస సర్కార్‌పై నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ శిల్పాల చెక్కడం పనులను పర్యవేక్షిస్తున్న ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, స్థపతి వేలు శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. 

 ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి విలేఖరులతో మాట్లాడుతూ, “యాదాద్రిలో శిల్పాలు చెక్కుతున్న శిల్పులకు స్తంభాలపై ఏ బొమ్మలు చెక్కాలనే విషయంలో వారికి పూర్తి స్వేచ్చనిచ్చాము. ఫలానా బొమ్మలు చెక్కాలని వారికి ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదు. ఆనవాయితీ ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలర్తో పాటు వర్తమాన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే బొమ్మలను కూడా వారు చెక్కుతుంటారు. వాటిని చెక్కే శిల్పికి సిఎం కేసీఆర్‌ అంటే చాలా అభిమానం. కేసీఆర్‌ తనకు దేవుడిలా కనిపిస్తున్నారని అందుకే ఆయన విగ్రహం కూడా స్తంభంపై చెక్కాలనుకుంటున్నానని తెలియజేస్తూ మాకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడుతున్న సంక్షేమ పధకాల గురించి భావి తరాలకు తెలియజేసేందుకే ఆ బొమ్మలు చెక్కారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. వాటికి రూపకల్పన చేసి అమలుచేసినందుకు సిఎం కేసీఆర్‌ బొమ్మను కూడా చెక్కారు. అలాగే కారు, సైకిలు, ఎడ్లబండి వంటి వాహనాల బొమ్మలను రాజకీయ చిహ్నాలుగా చూడటం సరికాదు. ఒకవేళ ఈ బొమ్మలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తొలగిస్తాము. దీనిపై అనవసర రాద్దాంతం చేయడం సరికాదు,” అని అన్నారు. 

ఆలయ స్తంభాలపై కేసీఆర్‌ బొమ్మను చెక్కమని ఎవరూ ఆదేశించలేదనడం తెరాస సర్కార్‌ను ఈ సంక్షోభంలో నుంచి బయటపడేయడానికేనని అర్ధమవుతూనే ఉంది. సాధారణంగా ఆలయ నిర్మాణం మొదలు నిత్య పూజల వరకు ప్రతీదీ ఆగమశాస్త్రం ప్రకారమే చేయవలసి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా ఉన్న యాదాద్రిలో స్తంభాలపై ఏఏ బొమ్మలు చెక్కాలో శిల్పుల ఇష్టానికి వదిలేశామని  చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే శిల్పులు వారి తల్లితండ్రులు లేదా వారికి నచ్చిన దేవతామూర్తుల బొమ్మలు చెక్కుకున్నా వైటీడీఏకి అభ్యంతరం ఉండదా?అని ప్రశ్నిస్తే వారి సంజాయిషీ ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్ధం అవుతుంది. 

కనుక ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికో లేదా వారి మౌకికాదేశాల కారణంగానో కేసీఆర్‌, కారు, సంక్షేమ పధకాల బొమ్మలు చెక్కి ఉంటారని చెప్పక తప్పదు. లేకుంటే స్తంభాలపై కేసీఆర్‌ బొమ్మలు చెక్కుతున్నారనే విషయం తెలియగానే స్వయంగా కేసీఆర్‌ లేదా దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగానీ స్పందించి విచారణకు ఆదేశించి ఆ బొమ్మలు చెక్కడం నిలిపివేసి చెక్కినవాటిని తొలగించమని ఆదేశించి ఉండేవారు. కానీ ఆలాచేయలేదంటే ప్రభుత్వ ఆమోదంతోనే ఇదంతా జరిగిందని అర్ధం అవుతోంది. 

సాధారణంగా ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు మద్యలో అధికారులే బలవుతుంటారు. ఇప్పుడూ అదే జరిగింది. అయితే జరిగిన అపచారాన్ని సరిదిద్దుకోకుండా మళ్ళీ సమర్ధించుకోవడం ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని గ్రహించాలి. విగ్రహాలు చెక్కించుకొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటే, తెరాస రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది.


Related Post