మంత్రివర్గ విస్తరణతో తెరాస తేనె తుట్టె కదలబోతోందా?

September 06, 2019


img

తెరాస మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి పరిస్థితులకి, ఇప్పటికీ చాలా తేడా కనబడుతోంది. అప్పుడు చంద్రబాబు తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని కానీ వెంటనే మేల్కొని ఆ సమస్య నుంచి బయటపడ్డామని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. ఫిరాయింపులను ప్రోత్సహించి టిడిపిని దారుణంగా దెబ్బతీసి కేసీఆర్‌ తన ప్రభుత్వానికి ఎదురులేకుండా చేసుకొన్నారు. 

ఆ తరువాత 5 ఏళ్ళ పాటు కేసీఆర్‌ పాడిందే పాట అన్నట్లుగా సాగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా అమలుచేయడంతో కేసీఆర్‌కు ప్రజాధారణ బాగా పెరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో సఖ్యత కారణంగా కోరినంతనే కేంద్రం నుంచి అనుమతులు వస్తుండటంతో సిఎం కేసీఆర్‌ ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. మంత్రులందరూ కేసీఆర్‌ గీసిన గీత జవదాటకుండా విధేయంగా మెసులుతూ చెప్పిన పని చెప్పినట్లు పూర్తి చేస్తుండటంతో ప్రభుత్వంపై, పార్టీపై కూడా సిఎం కేసీఆర్‌ పూర్తిపట్టు సాధించారు. 

తెరాసకు గట్టి సవాలు విసురుతున్న కాంగ్రెస్‌ను కూడా నిర్వీర్యం చేయడంతో తెరాసకు ఇక తిరుగులేదనట్లు కనబడింది. అయినప్పటికీ సిఎం కేసీఆర్‌ ముందు జాగ్రత్త చర్యగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడం చాలా మంచిదైంది. కాంగ్రెస్‌ కూటమిని చిత్తుగా చిత్తుగా ఓడించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 

కానీ సరిగ్గా అప్పటి నుంచే రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారడం మొదలైందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో తెరాస 7 ఎంపీ సీట్లను కాంగ్రెస్‌, బిజెపిలకు చేజార్చుకొని మొదటిసారి ఊహించని ఎదురుదెబ్బతింది. ముఖ్యంగా కేసీఆర్‌ కుమార్తె కవిత బిజెపి అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోరపరాజయం పొందడం తెరాసలో అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. 

కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందని...అప్పుడు డిల్లీలో చక్రం తిప్పవచ్చునని సిఎం కేసీఆర్‌ భావిస్తే, నరేంద్రమోడీ, అమిత్ షాల నేతృత్వంలో బిజెపి తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం తెరాసకు మరో షాక్. అవకాశం చిక్కితే ఏకంగా నరేంద్రమోడీనే గద్దె దించాలని కేసీఆర్‌ ప్రయత్నించడంతో మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కల్పించడం సహజమే. అందుకే తెరాస సర్కార్‌ పట్ల బిజెపి వైఖరిలో ఊహించని మార్పు వచ్చింది. తెరాస సర్కార్‌పై పట్ల కేంద్రం కటినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఇది తెరాసకు ఊహించని ఇబ్బందేనని చెప్పకతప్పదు.   

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని తుడిచిపెట్టేస్తే ఇక తెరాసకు తిరుగు ఉండదని కేసీఆర్ భావిస్తే, సరిగ్గా అదే...తెరాసకు కొరివితో తల గోక్కొన్నట్లయింది. కాంగ్రెస్‌ బలహీనపడటంతో దాని స్థానంలో బిజెపి ప్రవేశించి తెరాసను డ్డీకొనేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. రాష్ట్ర బిజెపి నేతలు ఏ చిన్న అవకాశం లభించినా తెరాస సర్కార్‌పై కత్తులు దూయడం మొదలుపెట్టారు. 

ఇక తెరాస సర్కార్‌కు నిత్యం సవాళ్ళు విసురుతూ ఇబ్బంది పెడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిలను అణచివేయాలని తెరాస ప్రయత్నిస్తే, వారు ముగ్గురూ  లోక్‌సభ ఎన్నికలలో ఎంపీలుగా గెలిచి ఏకు మేకైనట్లు తయారయ్యారు. తమకు లభించిన ఈ గొప్ప అవకాశాన్ని వారు ఉపయోగించుకొంటూ పార్లమెంటు  సమావేశాలలో తెరాస సర్కార్‌ వైఫల్యాలు, అవినీతి గురించి ప్రస్తావిస్తూ నలుగురు బిజెపి ఎంపీలతో కలిసి కేంద్రానికి  పిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా తెరాస సర్కార్‌ కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యల గురించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివేధిక కొరడమే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  

తెరాస అధికారం చేపట్టి 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో మంత్రిపదవులు ఆశిస్తున్నవారు తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా పదవుల కోసం పార్టీలో జరుగుతున్న పైరవీలు, దుష్ప్రచారం కారణంగా మంత్రి ఈటల రాజేందర్‌, రసమయి బాలకిషన్ వంటివారు బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతవారిని కాదని పార్టీలో కొత్తగా చేరినవారికి మంత్రిపదవులు దక్కుతున్నాయనే కారణంతో పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ మంత్రిపదవులపై ఆశతో అందరూ సంయమనం పాటిస్తున్నారు. 

ఇటువంటి పరిస్థితులలో మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన చేయడం అంటే తేనె తుట్టెను కదిలించడమే. కానీ త్వరలోనే దానిని కదిలించక తప్పదు. కదిలిస్తే ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు. తెరాసలో అంతర్గతంగా నెలకొన్న ఈ పరిస్థితులన్నిటినీ సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో మరింత బలపడాలని బిజెపి ఎదురుచూస్తోంది. కనుక కేసీఆర్‌ ఈ సమస్యలన్నిటినీ ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి. 


Related Post