నేను, ఈటల ఉద్యమంలో కొట్లాడినోళ్ళమి...రసమయి

September 06, 2019


img

కొన్ని రోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్‌ “గులాబీ జెండా ఓనర్లం మేమే... మంత్రిపదవి ఎవరి భిక్ష కాదు..” అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో, ముఖ్యంగా...తెరాసలో ఎంత రాజకీయ ప్రకంపనలు పుట్టించాయో అందరూ చూశారు. తాజాగా ఆయన శిష్యుడు, మానకొండూరు తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఆ వేడిని కొనసాగిస్తున్నట్లు మాట్లాడటం విశేషం. 

గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన గురుపూజోత్సవంలో వారిరువురూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ, “మేము ఉద్యమాలలో కొట్లాడినోళ్లo…కనుక కడుపులో ఏదీ దాచుకోము. మా ఇద్దరికీ అబద్దాలు చెప్పడం రాదు. నిజాలే మాట్లాడుతాము...” అని అన్నారు. 

రసమయి బాలకిషన్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న మంత్రి ఈటల, ‘జాగ్రత్త తమ్మీ..’ అంటూ మెత్తగా హెచ్చరించగా...‘మరేం పర్వాలేదన్నా...’ అంటూ రసమయి జవాబు చెప్పారు. 

ఆయన తరువాత మాట్లాడిన ఈటల రాజేందర్‌, “రసమయికి నిజంగానే కడుపులో ఏదీ దాచుకునే అలవాటు లేదు. కల్లాకపటం తెలియని వ్యక్తి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటాడు. అతని మాటలతో నేనూ ఏకీభవిస్తున్నాను. కొంతమంది రాజకేయనాయకులకు మెరిట్ లేదు. రాజ్యాంగంలో వ్రాసున్నట్లు మనం వ్యవహరిస్తున్నామా? రాజ్యాంగానికి మనం కట్టుబడి ఉన్నామా...లేదా? అంబేడ్కరిజంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. 

ఈటల చెపుతున్న ఆ ‘మెరిట్ లేని’ రాజకీయ నాయకులు ఎవరు? తెరాసలో ఉన్నవారి గురించే ఆయన ఆ మాటలు అన్నారా? తెరాస సర్కార్‌ పాలనలో బడుగు బలహీనవర్గాలకు సమన్యాయం చేస్తున్నామని చెప్పుకొంటున్నప్పుడు మళ్ళీ అంబేడ్కరిజంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఈటల ఎందుకన్నారు? రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్న ఈటల సూచన సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి అన్నదేనా? ఈటల, రసమయి తాజా వ్యాఖ్యలు చూస్తూ తెరాసలో ‘గులాబీ ముళ్ళు’ ఇంకా గుచ్చుకొంటూనే ఉన్నాయని అర్ధం అవుతోంది.


Related Post