నిజాయితీ..నిరాడంబరం..ఆ సౌక్యమే వేరబ్బా!

September 05, 2019


img

రోడ్డు పక్కన నిలబడి టిఫిన్ చేస్తున్న ఈయనను గుర్తుపట్టారా? బహుశః చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983, 85,89,99,2004 సం.లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా 5సార్లు గెలిచిన ఘనుడు. పేరు గుమ్మడి నర్సయ్య. కానీ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా తన పని తాను చేసుకుపోయారు. మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తప్ప మరో యావ లేదు.

వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచినపటికీ నేటికీ అత్యంత నిరాడంబరంగా ప్రజల మద్యనే జీవిస్తుంటారు. అందుకే ఆయన ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. నేటికీ ఇల్లందు ప్రజలు ఆయన పట్ల అపారమైన గౌరవాభిమానాలు చూపుతారు. గుమ్మడి నర్సయ్యకు ఆస్తులు, విలాసవంతమైన జీవితం లేకపోవచ్చు. కానీ ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. ప్రశాంతమైన జీవితం గడుపగలుగుతున్నారు.

ఒకప్పుడు దేశాన్ని ఏలిన గొప్ప నేతలు నేడు జైలుకు వెళుతున్నారు. వేలకోట్లు కూడబెట్టినా వారెవరికీ దొరకని సౌఖ్యం, గౌరవం, మనశాంతి గుమ్మడి నర్సయ్య సొంతం. నీతి, నిజాయితీ వలన కలిగే సౌఖ్యం అది. కనుక నేటి రాజకీయ నేతలందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని అంత నిరాడంబరంగా జీవించలేకపోయినా నీతి, నిజాయితీగా జీవిస్తూ పనిచేయగలిగితే ఈవిధంగా ‘తిహార్ జైల్ క్లైమాక్స్ సీన్స్’ ఎదుర్కొనే అవసరం ఉండదు. 


Related Post