కేటీఆర్‌ టార్గెట్ బిజెపి..అందుకేనా...

September 05, 2019


img

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుదవారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ సభ్యులతో తెలంగాణ భవన్‌లో సమావేశమైనప్పుడు, తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, నగరాభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదంటూ విమర్శలు గుప్పించారు. స్కైవే నిర్మించడానికి రక్షణశాఖ భూములను అడిగితే కేంద్రం స్పందించలేదని విమర్శించారు. 

గతంలో ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని తెరాస నేతలు విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ స్థానంలో బిజెపి ప్రవేశించడంతో ఇప్పుడు కేంద్రప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందంటూ మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. దాంతో బిజెపిని ఎదుర్కోవాలనేది తెరాస వ్యూహంగా కనిపిస్తోంది. 

కానీ కేంద్రప్రభుత్వం సహకరిస్తునందునే తెలంగాణ రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి చెందిందని బిజెపి నేతలు వాదిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిదంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు శరవేగంగా అనుమతులు మంజూరు చేశామని లేకుంటే తెరాస సర్కార్‌ కాళేశ్వరం పూర్తిచేయగలిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సహకరిస్తే తెరాస సర్కార్‌ భారీగా అవినీతికి పాల్పడిందని బిజెపి సీనియర్ నేత రఘునందన్ రావు ఆరోపించారు. ఒక్కోటి రూ.79 లక్షలు ఖరీదు చేసే బాహుబలి మోటర్లను తెరాస సర్కార్‌ ఒక్కోటి రూ.14 కోట్లు చొప్పున కొన్నట్లు చూపించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని దమ్ముంటే తెరాస సర్కార్‌ స్పందించాలని సవాలు విసిరారు. 

కేంద్రప్రభుత్వం దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికే యూరియా సరఫరా చేస్తే దానిని నిలువచేసుకునేందుకు గోదాములు లేక కుళ్ళబెట్టుకొంటోందని, మరోపక్క రాష్ట్రంలో రైతన్నలు యూరియా కోసం గోదాముల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని  కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.

బిజెపి నేతలు ఈస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నందునే తెరాస కేంద్రప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతోందని భావించవచ్చు. మున్సిపల్ ఎన్నికలలో తెరాసను గెలిపించుకోవడం ద్వారా కేంద్రానికి కనువిప్పు కలిగించాలని కేటీఆర్‌ చెప్పడం సెంటిమెంటును రగిల్చే ప్రయత్నమే. కానీ ఈసారి కూడా ప్రజలలో తెరాస సెంటిమెంటు రగిలించగలదో లేదో చూడాలి.


Related Post