హైకోర్టును కూడా ప్రభుత్వం తరలించబోతోందా?

September 05, 2019


img

హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌ను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయవాదులు నిరసనలు తెలియజేస్తున్నప్పుడు మరో కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని బుద్వేలు గ్రామంలో కొత్త భవనాలు నిర్మించి అక్కడికి హైకోర్టును తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టును తరలించాలనే ఆలోచనను విరమించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. హైకోర్టు తరలింపును అడ్డుకునేందుకు హైకోర్టు పరిరక్షణ సమితిని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పటికే సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. న్యాయపోరాటాలు కూడా చేస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు తరలింపుకు ప్రభుత్వం సిద్దపడితే, ప్రతిపక్షాలు దానిని వ్యతిరేకిస్తూ మరో పోరాటం మొదలుపెట్టడం ఖాయం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు, సచివాలయం వగైరాలు లేవు కనుక కొత్తవి నిర్మించుకోకతప్పదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్నీ ఉన్నప్పటికీ ఉన్నవాటిని కూల్చుకొంటూ కొత్తవి కట్టుకోవడం దేనికో అర్ధం కాదు. తెలంగాణ హైకోర్టు భవనం చాలా పాతదే అయ్యుండవచ్చు కానీ నేటికీ అది ఏమాత్రం చెక్కుచెదరలేదు. పైగా రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపును కల్పిస్తోంది.

సచివాలయం తరలింపు కారణంగా వివిదశాఖలు అస్తవ్యస్తంగా మారడంతో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు హైకోర్టును తరలించి మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం ఎందుకో తెలియదు. హైకోర్టును బుద్వేలుకు తరలించిన తరువాత ప్రస్తుత హైకోర్టు భవనాన్ని అలాగే ఉంచుతారా లేక దానినీ కూల్చివేస్తారో తెలియదు. 

ఒకపక్క సాగునీటి ప్రాజెక్టుల కోసం వేలకోట్లు అప్పులు తెస్తూ, అవసరమైతే వాటికోసం హైదరాబాద్‌లో భూములు అమ్ముకోవడానికి సిద్దపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, అవసరంలేని ఈ ఖర్చులు ఎందుకు చేస్తోందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక పాఠశాలలు, హాస్టల్స్ లో కనీస సౌకర్యాలు లేక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క ప్రజాసమస్యలు పేరుకుపోతుంటే వాటిని పరిష్కరించకుండా అప్రధాన్యమైన ఇటువంటి పనులకు ప్రభుత్వం ఎందుకు పూనుకొంటోందని ప్రతిపక్షాల ప్రశ్న.


Related Post