మోడీ విదేశీ పర్యటనలే ఇప్పుడు ఆదుకొన్నాయి

September 04, 2019


img

నరేంద్రమోడీ మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చాలా విస్తృతంగా విదేశీపర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సాధారణ ఛాయ్‌వాలా స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగిన నరేంద్రమోడీ, అధికారం చేతికి రాగానే విదేశీ పర్యటనల కోసం విచ్చలవిడిగా ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు వినబడ్డాయి. ఆయన భారత్‌లో కంటే విదేశాలలోనే ఎక్కువ పర్యటిస్తునారని, అక్కడే ఎక్కువ కాలం గడుపుతున్నారని, కేవలం ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలప్పుడే భారత్‌ తిరిగి వస్తుంటారంటూ చాలా జోకులు పేలాయి. అయితే నరేంద్రమోడీ వాటిని పట్టించుకోలేదు. అది వేరే సంగతి. 

మళ్ళీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా నరేంద్రమోడీ విదేశీపర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం  రెండురోజుల పర్యటన నిమిత్తం రష్యాకు వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భారత్‌-రష్యా సంబందాలు మరింత బలపడేవిధంగా మాట్లాడారు. భారత్‌-రష్యాల మైత్రి ఏదో ఇచ్చిపుచ్చుకునేందుకు కాక రెండుదేశాల మద్య స్నేహబందంగా నిలిచిందని అన్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుకులు, సమస్యలు, సవాళ్ళు ఎదురైనప్పటికీ అన్నిటినీ తట్టుకుని భారత్‌-రష్యా మైత్రి కాలపరీక్షలో నెగ్గిందని అని అన్నారు. 

రష్యా శత్రువుగా భావించే అమెరికాతో సత్సంబందాలు కొనసాగిస్తూ, తిక్క శంకరయ్య వంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చెట్టాపట్టాలేసుకొని కబుర్లు చెప్పి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఎటువంటి ఈర్ష్యాభావం ప్రదర్శించకపోవడం విశేషం. పైగా మోడీని ఒక పొరుగుదేశ ప్రధానిగా కాక ఆత్మీయ స్నేహితుడిగా ఆదరించి గౌరవించారు. 

 

ప్రధాని నరేంద్రమోడీ తన విదేశీపర్యటనలలో ఆయా దేశాధినేతలతో నెలకొల్పుకొంటున్న బలమైన సత్సంబంధాల కారణంగానే, భారత్‌ ఆర్మీ పాక్‌ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినపుడు, ఆ తరువాత బాలాకోట్‌పై భారత వాయుసేన దాడులు చేసినప్పుడు, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల చేయించడంలో, తాజాగా...కశ్మీర్‌ విషయంలో ప్రపంచదేశాలన్నీ భారత్‌ వైపే మొగ్గు చూపి పాకిస్థాన్‌ని బుద్దిగా మసులుకోమని మందలించాయి. 

చైనా ఒత్తిడి మేరకు ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ సమస్యపై అంతర్గత సమావేశం నిర్వహించినప్పుడు, భారత్‌ చర్యలను రష్యా బలంగా సమర్ధించడమే కాకుండా ఇటువంటి సమస్యలను భారత్‌తో చర్చించుకొని పరిష్కరించుకుంటే బాగుంటుందని పాకిస్థాన్‌కు గడ్డి పెట్టింది. భారత్‌తో అణుయుద్ధం చేయాలని తహతహలాడుతున్న పాకిస్తాన్ ఒకవేళ అటువంటి దుసాహసానికి పూనుకుంటే, భారత్‌ కంటే ముందు ప్రపంచదేశాలే పాకిస్థాన్‌ను కట్టడి చేయడం ఖాయం. 

అంతర్జాతీయంగా భారత్‌కు ఇంత అనుకూల పరిస్థితులు ఏర్పడటానికి కారణం ప్రధాని నరేంద్రమోడీ విదేశీపర్యటనలేనని అర్ధం అవుతోంది. కనుక అవి కొంచెం ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ, వాటి వలన భారత్‌కు కలుగుతున్న ఈ ప్రయోజనాలను చూస్తే ఆ మాత్రం ఆర్ధికభారం భరించవచ్చని చెప్పవచ్చు.


Related Post