చంద్రబాబు రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారా?

September 04, 2019


img

తెలంగాణలో టిడిపి సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి ఈరోజు డిల్లీలో బిజెపిలో చేరిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “నా రాజకీయ ఎదుగుదలకు కారణమైన టిడిపి, చంద్రబాబునాయుడు అంటే ఇప్పటికీ చాలా గౌరవం ఉంది. చంద్రబాబునాయుడే తెలంగాణ టిడిపి నేతలను బిజెపిలో చేరాలని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను నేను ఖండిస్తున్నాను,” అని అన్నారు. 

 టిడిపి నేతలను చంద్రబాబునాయుడే స్వయంగా బిజెపిలో చేరమని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. వాటిని టిడిపి నేతలు, బిజెపిలో చేరిన టిడిపి నేతలు గట్టిగానే ఖండిస్తున్నారు. కానీ బిజెపిలో చేరిన టిడిపి నేతలు నేటికీ చంద్రబాబునాయుడును వెనకేసుకురావడం గమనిస్తే, ముందు జాగ్రత్త చర్యగా ఆయనే వారిని బిజెపిలో చేరేందుకు ప్రోత్సహించి ఉండవచ్చుననే అనుమానాలు బలపడుతున్నాయి. అందుకు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి కూడా. 

ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీపై చాలా అతిగా విమర్శలు, ఆరోపణలు చేసిన చంద్రబాబునాయుడు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తరువాత మోడీని విమర్శించడం పూర్తిగా మానుకున్నారు. కానీ అంతమాత్రన్న మోడీ ప్రభుత్వం ఆయనను విడిచిపెడుతుందనుకోలేము. ఒకపక్క కేంద్రప్రభుత్వం, మరోపక్క కేసిఆర్, జగన్, ఏపీలో బిజెపి, వైసీపీ నేతలు... ఎటు చూసినా శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. ముఖ్యంగా తనపై పగబట్టి ఉన్న జగన్ ప్రభుత్వం తనపై, తన పార్టీపై ఏదోవిధంగా ప్రతీకారం తీర్చుకోకుండా విడిచిపెట్టదని చంద్రబాబు ఊహించగలరు. కానీ ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేసినందున ఇప్పుడు నేరుగా ఆయన సహాయం కోరలేని పరిస్థితి ఏర్పడింది. 

అందుకే తనకు అత్యంత ఆప్తులు, నమ్మకస్తులైన సీనియర్ టిడిపి నేతలను కాంగ్రెస్‌, బిజెపిలలోకి పంపించి వారి ద్వారా చంద్రబాబునాయుడు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకొన్నట్లు చెప్పవచ్చు. కనుక ఒకవేళ కేసీఆర్‌ లేదా జగన్ నుంచి బాబుకు ఎటువంటి ప్రమాదం ఏర్పడినా బిజెపిలో చేరిన టిడిపి నేతలు చక్రం తిప్పి అడ్డుకోవడం ఖాయం. కృష్ణానది ఒడ్డున ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చివేస్తామని రంకెలు వేసిన జగన్ ప్రభుత్వం ఇప్పటికీ ఆపని చేయలేకపోయింది. ఓటుకు నోటు కేసులో కూడా ఎటువంటి కదలిక రాలేదు. బహుశః బిజెపిలో చేరిన టిడిపి నేతలు తెర వెనుక చక్రం తిప్పుతునందునేనా?...ఏమో!


Related Post