తమిళసైతో తెరాస సర్కార్‌కు కొత్త కష్టాలు?

September 04, 2019


img

తెలంగాణకు గవర్నర్‌గా నియమితులైన తమిళసై సౌందరరాజన్‌ ఈనెల 8న బాధ్యతలు చేపట్టబోతునట్లు తాజా సమాచారం. 

తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి మొదటి నుంచి మంచి పట్టు, బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఈ ఏడాది కేవలం 12 లక్షల సభ్యత్వాలు మాత్రమే చేయించగలిగారు. కానీ హిందీ పార్టీలుగా ముద్రపడిన కాంగ్రెస్‌, బిజెపిలు కాలుమోపడానికి వీలుకాని తమిళనాడులో ఆమె బిజెపికి 44 లక్షల మంది సభ్యత్వాలు చేయించగలిగారు. తమిళనాడులో బిజెపిని బలోపేతం చేయడానికి ఆమె చేసిన కృషిని గుర్తించిన మోడీ ప్రభుత్వం, అటువంటి అవసరమే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఆమెను గవర్నర్‌గా నియమించడంతో తెరాస సర్కార్‌ పట్ల ఆమె ఏవిధంగా వ్యవహరించబోతున్నారో అర్ధమవుతుంది. బహుశః అందువల్లనే సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలెవరూ కూడా ఆమె నియామకంపై ఇంతవరకు స్పందించలేదని భావించవచ్చు. 

ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాలను ఎటువంటి అభ్యంతరాలు తెలుపకుండా గుడ్డిగా ఆమోదించారు. తెరాస సర్కార్‌పై ప్రతిపక్షాల పిర్యాదులను చెత్తబుట్టలో పడేసేవారు. కానీ ఇకపై కొత్త గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ తెరాస సర్కార్‌ నిర్ణయాలను గుడ్డిగా ఆమోదించకపోవచ్చు. అలాగే రాష్ట్ర బిజెపి నేతల ఫిర్యాదులపై ప్రభుత్వాన్ని నిలదీసినా ఆశ్చర్యం లేదు. 

2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని రాష్ట్ర బిజెపి నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు కనుక తెలంగాణకు గవర్నర్‌గా నియమితులైన తమిళసై సౌందరరాజన్‌ వారికి పరోక్షంగా సహాయసహకారాలు అందిస్తూ వారికి మార్గదర్శనం చేసినా ఆశ్చర్యం లేదు. 

ఇకపై తెరాస సర్కార్‌కు గవర్నర్ తమిళసై సహాయసహకారాలు ఏవిధంగా ఉంటాయో... అసలు ఉంటాయో లేదో తెలియదు. పైగా ఆమెవైపు నుంచి కొత్త సమస్యలు ఎదురైనా ఆశ్చర్యం లేదు. కనుక తెరాస సర్కార్‌కు అగ్నిపరీక్ష మొదలైనట్లే భావించవచ్చు. కానీ ఇప్పుడే ఆవిధంగా భావించడం కూడా తొందరపాటే అవుతుంది కనుక ఆమె పనితీరు చూసేవరకు ఎదురుచూడాలి. 


Related Post